కాల్‌సెంటర్‌! | - | Sakshi
Sakshi News home page

కాల్‌సెంటర్‌!

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

విద్యుత్‌ శాఖ కాల్‌సెంటర్‌ మూగనోము

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాల్సిన 1912 డిస్కం కాల్‌సెంటర్‌ మూగనోము పట్టింది. వినియోగదారుల కాల్స్‌ను నిమిషాల కొద్దీ వెయిటింగ్‌లో ఉంచుతూ ఉచిత సలహా ఇస్తోంది. ఫలితంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రమాదవశాత్తూ కరెంట్‌షాక్‌కు గురైన వారు కళ్లముందే కాలి బూడిదవుతున్నా..ఏమీ చేయలేని దుస్థితి తలెత్తుతోంది. భారీ ఈదురు గాలుల సమయంలోనే కాదు.. ఇటీవల చినుకులకే ఫీడర్లు, ఇన్సులేటర్లు ఎగిరిపోతున్నాయి. గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఈ అంతరాయాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని సీబీడీ, ఆపరేషన్‌ విభాగం ఇంజనీర్లకు వెంటనే చేరుస్తామని చెప్పుకొంటున్న దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ..వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను స్వీకరించి, వాటికి సత్వర పరిష్కార మార్గం చూపించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది.

సిబ్బంది లేక ఇబ్బంది..

ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుంటాయి. కండక్టర్‌ తెగిపడటంతో పాటు విద్యుత్‌ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలుతుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు 1912 కాల్‌ సెంటర్‌ సహా ఇతర మార్గాల ద్వారా ఎలక్ట్రిసిటీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఈసీసీసీ)కు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే..కాల్స్‌ స్వీకరించి, సమాధానం చెప్పేందుకు సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈసీసీసీకి సాధా రణ రోజుల్లో 150–200 ఫిర్యాదులు వస్తుంటాయి. వర్షాకాలంలో వీటి సంఖ్య రెండు వేలు దాటుతుంది. ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చే ఈ ఫిర్యాదులను స్వీకరించి, వాటికి పరిష్కారమార్గం చూపలేక ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది.

ట్రిప్పవని ఫీడర్లు

సాధారణంగా ఓవర్‌హెడ్‌ లైన్లు తెగిపడిన వెంటనే సర్క్యూట్‌ బ్రేకై .. రిప్లే ప్రొటక్షన్‌ తెరుచుకుని కొన్ని క్షణాల్లోనే ఫీడర్‌ ట్రిప్పై సరఫరా ఆగిపోతుంది. కానీ ఇటీవల బండ్లగూడ చౌరస్తా, అల్వాల్‌లో వెలుగు చూసిన ఘటనల్లో రిప్లే ప్రొటక్షన్‌ ఎందుకు పని చేయలేదనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. సబ్‌స్టేషన్లలో ఏఈ, ఏడీఈ, డీఈ పీరియాడికల్‌ తనిఖీలు చేసి ఎర్తింగ్‌, ఆయిల్‌ లెవల్స్‌ను పరిశీలించాలి. కానీ ఏ ఒక్క ఇంజనీరు సబ్‌స్టేషన్‌ వైపు వెళ్లడం లేదు. అంతే కాదు ట్రాన్స్‌కో, డిస్కంల మధ్య సమన్వయలేమితో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో 1912కు కాల్‌ చేస్తే గంటల కొద్దీ వెయిటింగ్‌

‘యూ ఆర్‌ ఇన్‌ క్యూ..’

అంటూ సమయం వృథా

వినియోగదారులను

గాలికొదిలేసిన డిస్కం

ఇబ్రహీంపట్నం డివిజన్‌ బొంగ్లూర్‌ జంక్షన్‌ విజయలక్ష్మీనగర్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు కరెంట్‌ పోయింది. గంటల తరబడి రాకపోవడంతో ఓ వినియోగదారుడు 1912 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయగా.. ‘యూ ఆర్‌ ఇన్‌ క్యూ..’ అంటూ 15 నిమిషాల పాటు వెయిటింగ్‌లో పెట్టింది. తీరా కాల్‌ కట్‌ చేసి మరోసారి ప్రయత్నించగా.. మళ్లీ అదే చేదు అనుభవం ఎదురైంది. చేసేది లేక డిస్కం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌ చాట్‌బాట్‌లో ప్రయత్నించాడు. లోకేషన్‌ షేర్‌ చేసినప్పటికీ.. మళ్లీ మళ్లీ ఇదే అంశాన్ని అడుగుతుండటంతో సదరు వినియోగదారుడికి చిర్రెత్తిపోయింది.

ఇలా ఈ ఒక్క విజయలక్ష్మీనగర్‌ వినియోగదారుడే కాదు గ్రేటర్‌ జిల్లాల పరిధిలో అనేక మంది వినియోగదారులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి కరెంట్‌ సరఫరా నిలిచిపోయిన ప్రతి సందర్భంలోనూ ఇదే సమస్య తలెత్తుతుండటం ఆందోళన కగిలిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement