కస్టమర్లపై అదనపు వడ్డింపులు | - | Sakshi
Sakshi News home page

కస్టమర్లపై అదనపు వడ్డింపులు

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

టిఫిన్లపై రూ.10, టీపై రూ.5

గ్యాస్‌ కొరతే కారణమంటున్న హోటళ్ల నిర్వాహకులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు.. జిల్లాలోని టీ, టిఫిన్‌ సెంటర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లో వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడటం, వంటగ్యాసుకు అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుండటంతో వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపై రుద్దుతున్నారు. నిన్న మొన్నటి వరకు రూ.10 ఉన్న టీ ధర.. తాజాగా రూ.15 పెంచేశారు. ప్లేటు ఇడ్లీ, వడ, దోశకు సైతం అదనపు చెల్లింపులు తప్పడం లేదు. ఒక్కో ప్లేటుకు రూ.పది అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అదేమంటే బహిరంగ మార్కెట్‌లో వంట గ్యాస్‌ దొరకడం లేదని, బ్లాక్‌మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌కు రూ.3 నుంచి రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని నిర్వహకులు చెబుతున్నారు. గ్యాస్‌ కొరత వల్ల ఇప్పటికే మెజార్టీ టీస్టాళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు మూతపడ్డాయి. ఉన్నవాటిలోనూ ధరలను అమాంతం పెంచడం గమనార్హం. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేక హోటల్లో కడుపునింపుకుందామని భావించే వారు పెరిగిన ఈ ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు.

కొరత పేరుతో కొట్టేస్తున్నారు..

జిల్లాలో 14 లక్షలకుపైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో మూడు వేలకుపైగా వాణిజ్య సిలిండర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మెజార్టీ టీ స్టాల్స్‌, చైనీస్‌ పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వహకులు వాణిజ్య అవసరాలకు కూడా డొమెస్టిక్‌ గ్యాసునే ఉపయోగించే వారు. ఇరుగు పొరుగు వారి సిలిండర్లను రీఫిల్‌ చేసి.. తమ అవసరాలు తీర్చుకునే వారు. అమెరికా, ఇజ్రాయిల్‌ కూటమి– ఇరాన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆయిల్‌ దిగుమతులు తగ్గిపోయాయి. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లు, డెలివరీ బోయ్స్‌ దీన్ని అవకాశంగా తీసుకున్నారు. వినియోగదారుల పేరున రీఫిల్‌ బుక్‌ చేసి, వాటిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ను రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయా హోటళ్లు, టిస్టాల్‌ నిర్వాహకులు వీటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని కస్టమర్లపై రుద్దుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఏజెన్సీలు/డెలీవరీ సర్వీసులపై నిఘా ఉంచాల్సిన విజిలెన్స్‌ అధికారులు సైతం వారిచ్చే అమ్యామ్యాలకు అలవాటుపడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement