పలువురి సంతాపం
తాండూరు టౌన్: తాండూరు పోతరాజుగా పేరు తెచ్చుకున్న జానపద కళాకారుడు అశోక్ గుండె పోటుతో మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి పెరగడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆయన మృతితో తాండూరులో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన పాశ్చాత్య, జానపద నృత్య ప్రదర్శన లతో అనేక స్టేజి ప్రోగ్రాంలు ఇచ్చారు. సుమారు 300 సార్లు పోతురాజు వేషం వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పోతరాజు వేషంతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 9 జాతీయ స్థాయి అవార్డులు, కళాపోషక అవార్డు, నాట్యశ్రీ అవార్డు, కల్పశ్రీ నాట్యకళా విభూషణ అవార్డు, ఉత్తమ జానపద కళాకారుడిగా తెలంగాణ ప్రభుత్వ అవార్డు తదితరాలను ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా 23 చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నటించారు. జబర్దస్త్ కామెడీ షోలో 9 ఎపిసోడ్‌లలో నటించారు. ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీని స్థాపించి, అనేక మంది యువతీ, యువకులకు జానపద నృత్యంలో శిక్షణ ఇచ్చి, ఉత్తర, ఈశాన్య భారత్‌లో అనేక ప్రదర్శనలు ఇప్పించారు. మృతుడు అశోక్‌కు భార్య, కొడుకు ఉన్నారు. తాండూరు పోతరాజుగా పేరు పొందిన అశోక్ మృతి పట్ల పలువురు అభిమానులు, కళాకారులు, పట్టణ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
కలప వాహనం సీజ్
ధారూరు: అక్రమంగా కలప తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని సోమవారం అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. ధారూరు ఫారెస్టు పరిధిలోని ముద్దాయిపేట్ నుంచి పరిగి పట్టణానికి కలప తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సంగాయిపల్లి తండాకు రమావత్ రాజు అనుమతి లేకండా కలప రవాణ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు కనకరాజు, కాశయ్య, వాచర్లు శ్రీధర్, నర్సింగ్, అఫ్రీది పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ బరువులో తేడా
విచారణ చేపట్టిన అధికారులు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్ నిర్ణీత బరువు కంటే తక్కువగా ఉండటాన్ని గమనించిన ఓ వినియోగదారుడు పంపిణీదారులను ప్రశ్నించారు. దీంతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదరు వినియోగదారుని వద్ద గ్యాస్‌ను చెక్ చేయగా ఫుల్ సిలిండర్ బరువు(గ్యాస్‌తో కలిసి) ఉండాల్సిన బరువు కంటే సుమారు కిలో తక్కువగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం అధికారులు సదరు గ్యాస్ గోదాం వద్దకు వెళ్లి ఇతర సిలిండర్లను చెక్ చేశారు. అక్కడ సిలిండర్లు సరైన బరువు ఉన్నట్లు గుర్తించారు. తక్కువ బరువు వచ్చిన గ్యాస్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. వినియోగదారుల ఫిర్యాదుతో పరిశీలించగా నిర్ణీత బరువు కంటే తక్కువగా ఉండటాన్ని గమనించామని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసిన ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు.


