మొయినాబాద్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బాలాజీ స్వామి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారిని మొదటగా గోపవాహనంపై, తరువాత హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, మురళి, కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారిని సూర్యప్రభ వాహనం, గరుడ వాహనంపై ఊరేగించి సేవలు అందించనున్నారు. రాత్రి 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి అన్నారు. సెర్ప్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఉల్లాస్ అమ్మకు అక్షరమాల పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పంచాయతీల పరిధిలో మహిళలకు అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు నేర్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని నాగన్‌పల్లిలో కార్యక్రమాన్ని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరికీ చదువు తప్పనిసరి అని పేర్కొన్నారు. వేలి ముద్రలు వేయకుండా సంతకాలు చేయాలని సూచించారు. చదువే జ్ఞానం చదువే వెలుగని, గ్రామాల్లో ఎక్కడ చూసినా చదువుకున్న వారే కనిపించాలన్నారు. కనీసం అక్షర అవగాహన ఉంటే మంచిదన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, అశోక్, ఆనంద్, జంగమ్మ, హరిలాల్, వీఓఏలు, గ్రామ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్: ఎల్‌పీజీ గ్యాస్ కొరతకు ప్రత్యా మ్నాయంగా బయో మాస్ పెల్లెట్స్ తయారు చేస్తున్నట్టు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్‌ను మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ప్రారంభించారు. స్థానిక హోటల్ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తయారు చేసిన బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫియర్ బాగా పనిచేస్తుందని.. చాలా మందికి నచ్చి ప్రొడక్షన్ పెంచాలని అడుగుతున్నారన్నారు. ఈ గ్యాసిఫియర్ ప్రైమరీ ఫైర్, సెకండరీ ఫైర్ రెండు రకాలుగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ వ్యర్థాలు బయో వుడ్ గ్యాసిఫియర్ ఇందనంగా వాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, కౌన్సిల్ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ షాబాద్ కిషన్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ రత్నం, నాయకులు మోర నర్సింహారెడ్డి, రవీందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: యువ క్రికెటర్లు క్రమశిక్షణ, కఠినశ్రమ, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అండర్ –19 భారత జట్టు ఆటగాడు అక్షత్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి బ్రాహ్మణపల్లి, జేబీ బృందావన్ కాలనీలోని స్మార్టీ క్రికెట్ అకాడమీలో ఆదివారం నూతన క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మంచి క్రికెటర్లు తయారు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ కొంతం మధుసూదన్ రెడ్డి, ప్రొఫెషనల్ సీనియర్ కోచ్‌లు ఎస్.మల్లేశ్ యాదవ్, రమేష్ గౌడ్, అజయ్ రైనా, దయానంద్ పటేల్, పలువురు అండర్–19, హెచ్‌సీఏకి ప్రాతనిధ్యం వహించిన క్రికెటర్లు పాల్గొన్నారు.


