ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేనేజర్ సూజాత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 1 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. డిపో పరిసర ప్రాంతాల ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
రక్షణ చట్టం ఆమోదం హర్షణీయం
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గణేశ్‌గౌడ్
కడ్తాల్: తెలంగాణ శాసనసభలో న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదం పొందడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కానం గణేశ్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగితే.. ప్రశ్నించే గొంతుకలైన న్యాయవాదుల రక్షణకోసం పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజాపాలనలో న్యాయవాదులకు గౌరవం, భద్రత, స్వాతంత్య్రం పరిరక్షించే దిశగా అడుగులు పడ్డాయని, దీనికి ఈ చట్టమే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు.. చట్టం అమలుకు మద్దతు పలికిన వారందిరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జీపీ భవనం మంజూరు చేయాలని వినతి
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వీరన్నపల్లి గ్రామ పంచాయతీ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లురవిని సర్పంచ్ రామకృష్ణయాదవ్ కోరారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. నాయకులు మిన్నాల డేవిడ్, రాఘవేందర్, లక్ష్మణ్‌యాదవ్ ఉన్నారు.


