
దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫె సర్ ధర్మనాయక్ అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని దూరవిద్య స్టడీ సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు. రెగ్యులర్ విశ్వవిద్యాలయాలతో సమానంగా సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అన్ని కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ తదితర కోర్సులు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీబీఏ కోర్సును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. మిగతా యూనివర్సిటీలతో పొల్చుకుంటే ఆంబేడ్కర్ యూనివర్సిటీలో ఫీజులు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. రెగ్యులర్ డిగ్రీలు చేయలేనివారు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దూరవిద్య డిగ్రీకి రెగ్యులర్ డిగ్రీతో సమానమైన విలువ ఉంటుందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ రాధిక పాల్గొన్నారు.
మంచాల: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని విశ్వహిందూ పరిషత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రతలపై పలు సూచనలు చేశారు. కార్య క్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐ మధు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని అనాజ్‌పూర్‌లో సర్వేనంబర్ 274తో పాటు పలు సర్వే నంబర్లలోని భూముల్లో కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సీలింగ్ భూముల సమస్యలు తక్షణం పరిష్కరించాలని భూబాధితులు కోరారు. రైతులకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ భవనం వద్ద మంగళవారం దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర నాయకుడు పి.జంగారెడ్డి హాజరై మాట్లాడారు. రైతులు చేస్తున్న సీలింగ్ పోరాటం న్యాయమైందని అన్నారు. రైతుల కళ్లలో కన్నీళ్లు తెప్పించిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేవన్నారు. ఎన్నో ఉద్యమా లతో రైతులకు సీలింగ్ పట్టాలు వచ్చాయని, సెత్వారులో పేర్లు వస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌లో చేర్చకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు రైతుల పోరాటానికి ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ముత్యాలు, జంగయ్య, బాలరాజు, మహేశ్, రైతులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: వన మహోత్సవం పేరుతో ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటిస్తుండగా.. మరోవైపు కొంతమంది పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని సాహెబ్‌గూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లను ఇష్టారాజ్యంగా నరికేశారు. విద్యుత్ తీగలకు కొమ్మలు తగులుతున్నాయనే సాకుతో మొదట కాండా లు తొలగించి, రెండు రోజుల తర్వాత మొదళ్ల వరకు కోత పెట్టారు. ఇది చూసిన స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వివరణ కోరగా.. స్కూల్ ఆవరణ లోని చెట్ల కారణంగా పిట్టలు, పాములతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విన్నవించడంతో తొలగించామన్నారు.

దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు

దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు