అక్కడోటి.. ఇక్కడోటి! | - | Sakshi
Sakshi News home page

అక్కడోటి.. ఇక్కడోటి!

Aug 4 2025 5:18 AM | Updated on Aug 4 2025 5:32 AM

అక్కడ

అక్కడోటి.. ఇక్కడోటి!

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో రంగారెడ్డి జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు.. కూకట్‌పల్లిలో విద్యుత్‌ ఆర్‌ఆర్‌జోన్‌ సీజీఎం ఆఫీసు.. పద్మారావునగర్‌లో తూనికలు కొలతల శాఖ.. బేగంపేటలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. సనత్‌నగర్‌లో రోడ్లు భవనాలు.. ఖైరతాబాద్‌లో జెడ్పీ, పంచాయతీరాజ్‌.. రెడ్‌హిల్స్‌లో నీటిపారుదలశాఖ.. మాసబ్‌ట్యాంక్‌లో పశుసంవర్థకశాఖ సహా జిల్లా ఉపాధి కల్పనశాఖ.. నాంపల్లిలో ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్స్‌.. అబిడ్స్‌లో జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు.. జిల్లా సహకారశాఖ.. రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ.. కొంగరలో కలెక్టరేట్‌.. ఇలా ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఒక్కోచోట ఉండిపోయింది. జిల్లాల పునర్విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో రెవెన్యూ పరిధిలో సమీకృత జిల్లా భవన సముదాయం నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు చెట్టుకొకటి.. పుట్టకొకటి అన్నట్లుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒకే గొడుగు కిందికి రావడం లేదు.

44 ఎకరాలు.. రూ.58 కోట్లతో భారీ భవనం

జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిపాలన సౌలభ్యం పేరుతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాను అప్పటి ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. ఆయా జిల్లాల్లో కొత్తగా సమీకృత జిల్లా సముదాయాలను నిర్మించింది. కొంగరకలాన్‌లో 44 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక భవన సముదాయాన్ని నిర్మించింది. వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ శాఖలన్నీ ఇప్పటికే ఆయా జిల్లాల్లోని కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఇప్పటికీ హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండటం, జిల్లా కేంద్రానికి వాటిని తరలించే ఆలోచన అధికారులకు లేకపోవడంపై గందరగోళం తలెత్తుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కలెక్టరేట్‌లోని అందుబాటులో ఉంటారని భావించి చాలామంది ఇప్పటికీ కొంగరకు చేరుకుంటున్నారు. తీరా ఆయా శాఖల అధికారులు అక్కడ లేరనే విషయం తెలిసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.

ఫీల్డ్‌ విజిట్‌ పేరుతో డుమ్మా

కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలతో పాటు సివిల్‌ సప్లయ్‌, విద్య, వ్యవసాయ శాఖలు మినహా కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగాలన్నీ ఇప్పటికీ నగరంలోని ఇరుకై న అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వాటికి సొంత భవనాలు నిర్మించినప్పటికీ ఇంటికి దూరమవుతుందని, హెచ్‌ఆర్‌ఏలో కోత పడుతుందనే ఆలోచనతో మెజార్టీ ఉద్యోగులు అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. తూనికలు కొలతలు, ఉపాధి కల్పన, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖల అధికారులు ఫీల్డ్‌ విజిట్‌ పేరుతో రోజుల తరబడి ఆఫీసుకే రావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ.. అడ్డంగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక కొంతమంది సతమతమవుతుంటే.. మరికొంత మంది చిన్నచిన్న పనులకు 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఆయా ప్రాంతాల్లోని ఆఫీసులకు చేరుకుంటే తీరా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

అస్తవ్యస్తంగా జిల్లా పరిపాలనా వ్యవస్థ

ఒక్కో చోట.. ఒక్కో ప్రభుత్వ కార్యాలయం

ఏ ఆఫీసు ఎక్కడుందో అంతా అయోమయం

చిన్నచిన్న పనులకు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం

తిరిగి వేసారి ఉసూరుమంటున్న బాధితులు

అక్కడోటి.. ఇక్కడోటి! 1
1/2

అక్కడోటి.. ఇక్కడోటి!

అక్కడోటి.. ఇక్కడోటి! 2
2/2

అక్కడోటి.. ఇక్కడోటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement