
సినారె సేవలు మరువలేనివి
తుర్కయంజాల్: తెలుగు సాహిత్యానికి డా.సి.నారాయణ రెడ్డి ఎనలేని సేవలు చేశారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహాకవి సినారె కళాపీఠం హైదరాబాద్ అధ్యక్షుడు మల్లికేడి రాములు నిర్వహణలో సి.నారాయణ రెడ్డి 94వ జయంతి వేడుకలను ఆదివారం పురపాలక సంఘం పరిధిలోని రాగన్నగూడలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన ఎన్నో పాటలు అన్ని వర్గాల ప్రజలను అలరించాయని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. నారాయణ రెడ్డి గేయ నాటికలు, పద్య గేయ సంపుటి, దీర్ఘగీతం, గేయ నాటికలు, గేయ కావ్యం, కవితా సంపుటి, వచన కవితా సంపుటి, వ్యాఖ్యానం, నృత్య గేయరూపకం, సినీగీతాల సంకలనం వంటి ఎన్నో రచనలను చేశారని గుర్తుచేశారు. అనంతరం సినారె జీవన సాఫల్య పురస్కారాన్ని డా. లింగంపల్లి రామచంద్రకు అందజేశారు. సాహిత్య పురస్కారాలను తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన డా. నాళేశ్వరం శంకరం, డా. రాధశ్రీ, డా. ఆచార్యా ఫణీంద్ర, కాసుల ప్రతాప్ రెడ్డి, దోరవేటి చెన్నయ్య, మౌన శ్రీ మల్లిక్, జువ్వాడి దేవి ప్రసాద్, తత్వాతి ప్రమోద్ కుమార్, మంథని శంకర్, అగ్రహారం ఛందోజీ రావు, అరుణ నారదభట్ల, పెద్దూరి వెంకటదాసు, పొన్నాల బాలయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాసు, మాజీ కౌన్సిలర్ కాకుమాను సునీల్, ప్రముఖ సంఘ సేవకులు దాసరి దయానంద్ రెడ్డి, తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు డా. పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.