‘ఉపాధి’ పనుల్లో రాష్ట్రంలోనే జిల్లా ఫస్ట్ 4,02,360 పనిదినాలు శాశ్వత ఆస్తుల నిర్మాణంలో బెస్ట్ ప్రణాళిక ప్రకారం వీబీ జీ రామ్ జీ పనులు అధికారులను అభినందించిన సీఎస్ సంజయ్ జాజు
సిరిసిల్ల: కరువు పరిస్థితుల్లో పల్లె ప్రజలకు వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్(వీబీ జీ రామ్‌జీ) పనులు కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి పనుల నిర్వహణపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా పనులు గుర్తించి చేయిస్తున్నారు. 378 పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందులో జిల్లాకు అనువైన, కూలీలకు ఉపాధి కల్పించే పనులను చేపడుతున్నారు. ప్రతి కూలీకి 125 పనిదినాలు కల్పించేలా ముందుకు వెళ్తున్నారు.
నీటి వనరులకు జీవం
చెరువుల్లో పూడికతీతతో సాగునీటి వనరులకు జీవం పోసినట్లు అవుతుంది. చెరువు మట్టి పొలాల్లో భూసారం పెంచగా.. మరోవైపు నీటి నిల్వ పెంచేందుకు ఈ పనులు ఉపయోగపడుతున్నాయి. మరోవైపు మట్టి రోడ్ల నిర్మాణం, ఫిష్‌పాండ్స్, అటవీ భూముల్లో కందకాలు, మొక్కలు నాటడం– సంరక్షించడం, అటవీభూముల్లో మొక్కలు నాటడం, పశువులు, గొర్రెల షెడ్లు, కంపోస్టుషెడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, కమ్యూనిటీహాళ్లు, గ్రామీణప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నారు. పొలాల కాలువల శుభ్రత, సాగునీటి కాలువల మరమ్మతు వంటి శ్రమ ఆధారిత పనులను గుర్తించి చేయిస్తున్నారు. ప్రతీ 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి, మొబైల్‌ఫోన్ ద్వారా హాజరు నమోదు చేపడుతున్నారు. మొబైల్‌లో కూలీల నమోదుతో అక్రమాలకు చెక్ పడింది.
రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం
రాష్ట్ర స్థాయిలో జిల్లాకు వీబీ జీ రామ్‌జీలో మొదటిస్థానం లభించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను అభినందించారు. జిల్లాలో వాన నీటి సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. ఇందులో 210 ఫామ్‌పాండ్స్, 1,769 మ్యాజిక్ సోక్ పిట్స్, 91 సామూహిక ఇంకుడుగుంతలు, 464 బోర్‌వెల్ రీచార్జ్ గుంతల పనులు చేపట్టారు.
వీబీ జీ రామ్‌జీ స్వరూపం
గ్రామాలు : 260
మొత్తం జాబ్‌కార్డులు : 98 వేలు
జూలై నుంచి అక్టోబరు వరకు కల్పించిన పనిదినాలు: 4,02,360
ఈ ఏడాది వేతనాలుగా చెల్లింపులు
: రూ.12.90 కోట్లు
మెటీరియల్ కోసం చేసిన ఖర్చు: రూ.76 లక్షలు
ఒక్కో ఊరిలో హాజరవుతున్న
సగటు కూలీలు: 45
ఒక్కో కూలీకి రోజుకు లభిస్తున్న సగటు కూలి
: రూ.250 నుంచి రూ.300
ఇంకా మెటీరియల్ ఖర్చు చేయాల్సింది : రూ.7.37 కోట్లు


