● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లటౌన్: విద్యార్థులు సెల్‌ఫోన్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ‘నిత్య జాతీయ పతాకావిష్కరణ’ కార్యక్రమం వంద రోజుల కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. సామాన్యులనూ భాగస్వాములను చేస్తూ నిత్యం జాతీయ పతాకావిష్కరణ చేయించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సామల వివేకానంద్, అధ్యాపకులు శ్రీధర్, బి.వెంకటేశం, కనకయ్య, రాజయ్య, ఆంజనేయులు, చంద్రమౌళి, సురేష్, విజయ, సరోజ, చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత, మమత, నర్మద, సాగర్ పాల్గొన్నారు.
కానిస్టేబుల్ సస్పెన్షన్
ముస్తాబాద్: అవినీతికి పాల్పడిన ఓ కానిస్టేబుల్‌ను ఎస్పీ మహేశ్ బీ గీతే సస్పెండ్ చేశారు. సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్‌రావు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల మేరకు విచారణ చేశారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీలో పలువురి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్ప డ్డాడు. అలాగే ఎస్‌హెచ్‌వోను తప్పుదొవ పట్టించి ఠాణాకు వచ్చిన వారి నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు అఽధికారుల దృష్టికి వచ్చింది. ఈమేరకు ఎస్పీకి ఇచ్చిన నివేదిక మేరకు అరుణ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
రాళ్లపేటలో బెల్టుషాపుల మూసివేతకు తీర్మానం
తంగళ్లపల్లి: మండలంలోని రాళ్లపేటలో బెల్టుషాపులు మూసివేయాలని శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ బాలసాని పరశురాములు, పాలకవర్గం, గ్రామపెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ తీర్మానాన్ని ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.20వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామంలో గొడవలు నివారించి, మహిళల భద్రత, కుటుంబాల ఆర్థిక పరిరక్షణ, యువత బంగారు భవిష్యత్తే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జిల్లా ఆవిర్భావ దశాబ్ది కవి సమ్మేళనం
సిరిసిల్ల: జిల్లా ఆవిర్భవించి పదేళ్లు అవుతున్న సందర్భంగా దశాబ్ది కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని జిల్లా ఆవిర్భావ దశాబ్ది కమిటీ శుక్రవారం తెలిపారు. జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ బైపాస్‌రోడ్డులోని తెలంగాణ భవన్‌లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా వైభవం నాడు–నేడు, జిల్లా చరిత్ర, సాంస్కృతిక, సాహిత్య, కళా, చేనేత అభివృద్ధిపై కవితాగానంతో ఆవిష్కరించాలని నిర్ణయించా రు. సిరిసిల్ల గాంధీచౌక్, మార్కండేయవీధిలోని లక్ష్మణ్ ప్రింటర్స్‌లో కవితలను అందించాలని నిర్వాహకులు వెంగళ లక్ష్మణ్, ఆడెపు లక్ష్మణ్, అంకారపు రవి కోరారు.
జాతీయస్థాయి పోటీలకు అఫ్జల్‌బేగం
సిరిసిల్ల అర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్‌బేగం షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 7న అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ నిర్వహించారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్ అభినందించారు.


