● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి
సిరిసిల్ల: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం మేరకు కొత్తగా 17 సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్‌లో శుక్రవారం విద్యుత్ పంపిణీని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా సమయంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని, ఫీడర్లపై లోడ్ పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. వోల్టేజీ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంభీరావుపేట, నేరెళ్ల ప్రాంతాల్లో నిర్మించే 132 కేవీ సబ్‌స్టేషన్ల పనుల పురోగతిని పరిశీలించారు. సిరిసిల్లలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో కొత్తగా రెండు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం 160 ఎంవీఏకి పెంపు, నిమ్మపల్లిలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ 31.5 ఎంవీఏకి పెంపు, చిప్పలపల్లిలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ 31.5 ఎంవీఏకి పెంపు, మల్లారం 132 కేవీ సబ్‌స్టేషన్‌లో 50ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పనులను సీఎండీ పర్యవేక్షించారు.
కొత్తగా 17 సబ్‌స్టేషన్ల నిర్మాణం
జిల్లాలో 17 కొత్త 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇందులో సిరిసిల్ల సుభాష్‌నగర్, కలెక్టరేట్, నూకలమర్రి, మర్రిమడ్ల, లింగంపేట, ఎన్గల్, వేములవాడ ఆలయం, నర్సింగాపూర్, పాపయ్యపల్లి, మాన్వాడ, మద్దిమల్ల, మల్లారెడ్డిపేట, కనగర్తి, దాచారం, బండలింగంపల్లి, పదిర, వెల్జీపూర్‌లో సబ్‌స్టేషన్లు నిర్మిస్తామన్నారు. ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఈఈ సిరిసిల్ల అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
లో వోల్టేజీ సమస్య లేకుండా చూస్తాం
ముస్తాబాద్: లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి, మెరుగైన విద్యుత్ అందేలా కృషి చేస్తున్నామని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సాక్షి’లో ‘కాలుతున్న ట్రాన్స్ఙ్‌ఫార్మర్లు’..ఎండుతున్న పంటలుశ్రీ శీర్షికన ఈనెల 6న ప్రచురితమైన కథనానికి సీఎండీ స్పందించారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్లను, చిప్పలపల్లిలో సబ్‌స్టేషన్‌ను శుక్రవారం పరిశీలించారు. అదనంగా డీటీఆర్‌లు ఇస్తామని, రైతులు అనుమతులు తీసుకుని మోటార్లు పెట్టుకోవాలన్నారు. ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, డీఈఈ అంజయ్య, ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ విష్ణుతేజ ఉన్నారు.


