● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: వయోవృద్ధులు, తల్లితండ్రుల సంరక్షణకు చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సంక్షేమశాఖ ఆద్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. వయోవృద్ధులు, తల్లితండ్రుల సంక్షేమానికి అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి వృద్ధుల సంరక్షణ చట్టాలు, ఉపయోగాలు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధుల నుంచి గౌరవం, మర్యాద, సంస్కృతి, సంప్రదాయాలు, విశేషమైన అనుభవాలు ఇప్పటి తరం నేర్చుకోవాలని సూచించారు. వృద్ధులు తాము కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని పిల్లల పేరిట చేయకుండా, సంరక్షణ చూడకపోతే వెనక్కి తీసుకుంటామనే నిబంధన పెట్టాలన్నారు. వృద్ధ మహిళలకు జిల్లాలో 469 సంఘాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని డే కేర్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృద్ధులు తమ ఇబ్బందులు తెలియజేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావచ్చని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య, వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులను సన్మానించారు.
మెడికల్ కాలేజీ తనిఖీ
సిరిసిల్ల శివారులోని మెడికల్ కాలేజీని కలెక్టర్ తనిఖీ చేశారు. బాలికలు, బాలుర వసతిగృహాల నిర్మాణాలు పరిశీలించారు. ప్రహరీగోడ నిర్మించి హాస్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసి వైద్య విద్యార్థులకు వసతులు కల్పించాలని కోరారు. ఆర్‌అండ్‌బీ ఈఈ బీమ్లానాయక్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఏవో అఫ్జల్‌బేగం, పశువైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, ఇరిగేషన్ ఈఈ దయాకర్, ఉద్యాన వనాల శాఖ అధికారి శరత్ తదితరులు పాల్గొన్నారు.


