● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు చిన్నారుల్లో పోషకాహారలోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఏరియా ఆస్పత్రి ఆవరణలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలో బేరా యంత్రాన్ని ప్రారంభించారు. డీఈఐసీ కేంద్రంలో దాదాపు 18 మంది పిల్లలు ఫిజియోథెరపీ ద్వారా శారీరక ఇబ్బందులు దూరమై ఇప్పుడు నడుస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విప్ మాట్లాడుతూ చిన్నారుల్లో వినికిడి లోపం, మాటలు రాకపోవడం, శారీరక ఎదుగుదలలో సమస్యలు ఉన్న వారిని గుర్తించి గతంలో మెరుగైన వైద్యం కోసం నిమ్స్, సరోజినీదేవి, ఈఎన్‌టీ ఆస్పత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేములవాడ ఆస్పత్రిలో ప్రత్యేక థెరపీ సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వినికిడి లోపాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షల నిర్వహణకు అవసరమైన గదిని ఏర్పాటు చేసి సేవలు ప్రారంభించినట్లు వివరించారు. వేములవాడ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా మోకాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని విప్ తెలిపారు. సీ–ఆర్మ్ మిషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రతీ మంగళవారం 10 నిమిషాలు
కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతీ మంగళవారం 10 నిమిషాలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రాల సేవలు, వసతులు మెరుగుపరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలన్నారు. బేరా యంత్రం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుభాషిణి పాల్గొన్నారు.


