సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ధాన్యం తూకం వేసేలా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో లారీలు, హమాలీల కొరత ఉండడంతో స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లలోనూ ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఽపౌరసరఫరాల అధికారులతో పాటు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీ ల్దార్లు తమ పరిధిలోని కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం నిర్వాహకులకు సూచనలు చేస్తూ కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లోని కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి(డీపీవో) షరీఫోద్దీన్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల్లోని కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి(డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం మంగళవారం తనిఖీ చేశారు.


