ఇల్లంతకుంట(మానకొండూర్): రద్దు చేసిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని మంగళవారం పెద్దలింగాపురం గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇల్లంతకుంట నుంచి పెద్దలింగాపురం గ్రామంలోకి సిరిసిల్ల డిపో బస్సు రోజూ ఉదయం, సాయంత్రం నడిచేదని, ప్రస్తుతం గ్రామంలోకి రాకుండా, ఊరుకు పక్కన ఉన్న రోడ్డు మీదుగా నడుపుతుండడంతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొన్నారు. డిపో మేనేజర్‌కు గ్రామ సర్పంచ్ పలుసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామం పక్క నుంచి వెళ్తున్న బస్సు ఎదుట గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, ఆర్టీసీ డిపో ట్రాఫిక్ రూట్ ఇన్‌చార్జి ఘటన స్థలానికి చేరుకొని బస్సును పునరుద్ధరిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. సర్పంచ్ గన్నారం వసంత నర్సయ్య, ఉపసర్పంచ్ ఎలవేణి రమేశ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


