పీఎంజే దోపిడీ కేసులో క్లూ ఇచ్చిన మొబైల్
దాని డేటా ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం
ఎన్‌క్రిప్టెడ్ యాప్స్‌తో నిందితుల సంభాషణ
చోరులందరికీ ఒకరితో మరొకరికి లేని పరిచయం
బిహార్ జైలు నుంచి దోపిడీకి ‘సుబోద్ గ్యాంగ్’ ప్రణాళిక
చోరీ, రవాణా, విక్రయాలకు వేర్వేరు గ్రూపులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ఎంత పెద్ద క్రిమినల్ అయినా.. ఏదో ఒక క్లూ వదిలేస్తాడు.. అదే దొంగలను చిక్కేలా చేస్తుంది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో ఇదే తరహాలో దొరికిపోయారు. ఈనెల 3వ తేదీన పీఎంజేలో దోపిడీ చేసి, నలుగురు సిబ్బందిని తుపాకులతో కాల్చిన అనంతరం ధర్మపురి మీదుగా పారిపోయిన దొంగలు తాము వినియోగించిన ఒక సెల్‌ఫోన్‌ను మద్దునూరు వద్ద పగలగొట్టి వెళ్లిపోయారు. స్థానికులు ఆ సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. ఆ సెల్‌ఫోన్‌లో లభించిన డేటా ద్వారా దొంగల సమాచారం లభించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి బిహార్‌లో ఒకరిని, బెంగాల్‌లో మరొకరిని పట్టుకున్నారు. నిందితులంతా స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎన్‌క్రిప్టెడ్‌యాప్స్ ద్వారా సంభాషించుకోవడం గమనార్హం. పోలీసులు డేటా రీట్రైవ్ చేయడం ద్వారా కీలక సమాచారం లభించింది.
సినీ తరహాలో దోపిడీ
ఈ మొత్తం చోరీకి బిహార్ జైలు వేదికగా ప్రణాళిక జరిగింది. దేశంలోని పలు బంగారం సంస్థలే టార్గెట్‌గా చోరీలు చేసే సుబోధ్ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 70 మందికిపైగా ప్రైవేటు సైన్యంతో ఆరు రాష్ట్రాల్లో ఇతని నెట్‌వర్క్ విస్తరించి ఉంది. సినీ తరహాలో దోపిడీలు చేయడం వీరి ప్రత్యేకత. కరీంనగర్ దోపిడీ కోసం ఆరుగురు ఒకరితో మరొకరికి పరిచయం లేనివారిని ఎంచుకున్నారు. కేవలం దోపిడీ మాత్రమే వీరి పని. ఆ తరువాత బంగారం తరలించేందుకు ఒక గ్యాంగ్, విక్రయానికి మరోగ్యాంగ్, ఆ డబ్బు తరలించేందుకు ఇంకో గ్యాంగ్ పనిచేస్తాయి. ఒకవేళ పోలీసులకు నిందితులు చిక్కినా పూర్తిస్థాయి సమాచారం దొరకక కేసు జాప్యం అవుతుంది. ఈలోపు బంగారం విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఈ దోపిడీలో పాల్గొన్న వారికి రూ.5లక్షలు ఇస్తామని ఒప్పుకున్నట్లు సమాచారం.
త్వరలోనే ప్రెస్‌మీట్..
ధర్మపురి వద్ద విడిపోయిన దొంగలు... వేర్వేరుగా బెంగాల్, బిహార్, రాజస్థాన్, ముంబై వైపు పారిపోయారు. ఈ నేపథ్యంలో చోరీ చేసిన సొత్తు రికవరీ చేయడం, మిగిలిన ముగ్గురు దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. అయితే, నిందితులు సొత్తు ఎక్కడ విక్రయించారు? అన్న విషయంలోనూ పోలీసులు పలు కీలక ఆధారాలు సంపాదించారు. సుబోధ్ గ్యాంగ్ ఇప్పటి వరకూ 30 కిలోల వరకు బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్ వద్ద దొంగ బంగారం కొనే వ్యాపారుల జాబితా కూడా కరీంనగర్ పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిపార్ట్‌మెంట్ ధీమాగా ఉంది. త్వరలోనే నిందితులందరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.


