‘బెస్ట్‌ అవెలబుల్‌’ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘బెస్ట్‌ అవెలబుల్‌’ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

సిరిసిల్ల: బెస్ట్‌ అవెలబుల్‌ పథకంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. 3,5,8వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించి, గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ కేటగిరీలో సీట్లకు తల్లిదండ్రుల సమక్షంలో డ్రా తీశారు. 3వ తరగతికి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి, 5వ తరగతికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 8వ తరగతికి ఒక అబ్బాయిని ఎంపిక చేశారు. జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ

సిరిసిల్ల: జిల్లా సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మంగళవారం సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానంలో మెడల్స్‌, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అండర్‌–10 లాంగ్‌జంప్‌లో బి.కార్తీక్‌ ప్రథమ, 60 మీటర్ల పరుగు పందెంలో బి.సుదీష్ణ ప్రథమ, లాంగ్‌జంప్‌లో కె.చాణక్య ద్వితీయ, 600 మీటర్ల పరుగుపందెంలో కె.సాయిసామ్రాట్‌ తృతీయ స్థానంలో నిలిచారు. అండర్‌–12 విభాగం 300 మీటర్ల పరుగుపందెంలో జె.అవినాష్‌ ప్రథమ, అండర్‌–14 లాంగ్‌జంప్‌లో బి.జస్వంత్‌ ప్రథమ, 60 మీటర్ల పరుగుపందెంలో బి.రేవంత్‌ ప్రథమ స్థానం సాధించారని కోచ్‌లు జి.బాబు, బి.నవీన్‌ తెలిపారు. ప్రతిభచాటిన చిన్నారులను సిరిసిల్ల కోర్టు ప్లబిక్‌ ప్రాసిక్యూటర్‌ వేణుగోపాల్‌, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నారాయణ అభినందించారు.

ఏబీ స్విచ్‌లతో మెరుగైన విద్యుత్‌

సిరిసిల్ల: జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీడీసీఎల్‌ సిరిసిల్ల సర్కిల్‌ ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 26 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సింగిల్‌ ఫేజ్‌ ఏబీ స్విచ్‌లు పెట్టామని, దీంతో గ్రామాల్లో ఎక్కడైన అంతరాయం ఏర్పడితే లైన్‌ మొత్తం విద్యుత్‌ సరాఫరా నిలిపివేయకుండా కేవలం సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద నిలిపి వేసి సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. విద్యుత్‌ లైన్లలో సాంకేతిక లోపాలు, చెట్ల కొమ్మలు తగలడం, భారీ వర్షాలు, ఈదురుగాలుల వంటి కారణాలతో విద్యుత్‌ అంతరాయాలను తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. మరమ్మతు పనుల సమయంలో విద్యుత్‌ నియంత్రణ సులభమై సిబ్బంది భద్రత మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. అత్యవసర విద్యుత్‌ సమస్యల ఫిర్యాదుల కోసం వినియోగదారులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912లో సంప్రదించాలని కోరారు.

హైరిస్క్‌ గర్భిణులను గుర్తించాలి

సిరిసిల్ల: జిల్లాలో క్షేత్రస్థాయిలో ఆశ నోడల్‌ పర్సన్లు గర్భిణులకు తరచూ పరీక్షలు చేస్తూ హైరిస్క్‌ ఉన్నవారిని గుర్తించాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కోరారు. మంగళవారం డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశం మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలని కోరారు. డెలివరీ సమయం వచ్చేనాటికి వారిని మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలు సాధించాలని, జిల్లాను అన్ని పారామీటర్స్‌లో ముందుంచేందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. పోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ అనిత, సీహెచ్‌వో శాంత, డీడీఎం కార్తీక్‌, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement