● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. గీతానగర్‌లోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్‌క్యాంపును ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాట్యం, సంగీతం, చేతిరాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించిన విద్యార్థిని అంకాలపు సిరిని అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, తహసీల్దార్ మహేశ్, ఎంఈవో రఘుపతి, హెచ్‌ఎం శారద పాల్గొన్నారు.
జనగణన సిబ్బందికి సహకరించాలి
జనగణన–2027 మొదటి దశలో భాగంగా నేటి నుంచి జూన్ 9 వరకు ఇంటింటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. సుభాష్‌నగర్‌లో పర్యటించి, జనగణనను పరిశీలించారు. జిల్లాలో 173 మంది సూపర్ వైజర్లు, 1,025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపా రు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, తహసీల్దార్ మహేశ్ పాల్గొన్నారు.
కంప్యూటర్ల పంపిణీ
జనగణన చార్జ్ అధికారులకు కంప్యూటర్, ప్రింటర్లను కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ అందించారు. సమాచార సేకరణ, నివేదికల తయారీ వేగవంతంగా చేసేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 ఎస్‌ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


