జీరో దందాకు జీ హుజూర్‌ ! | - | Sakshi
Sakshi News home page

జీరో దందాకు జీ హుజూర్‌ !

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

జీఎస్టీ ఆఫీస్‌కు భవనం దొరకడం లేదట కరీంనగర్‌లోనే అధికారుల కాలక్షేపం సీజీఎస్టీ ఆఫీస్‌ ఉన్నా.. లేనట్లే ! జిల్లాలో జోరుగా జీరో వ్యాపారాలు పట్టించుకోని జీఎస్టీ అధికారులు

సిరిసిల్ల: జిల్లా ఆవిర్భవించి పదేళ్లు సమీపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపే వస్తు సేవ పన్ను(జీఎస్టీ) ఆఫీస్‌ ఏర్పాటుకు సిరిసిల్లలో ప్రభుత్వ భవనమే దొరకడం లేదట. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ శాఖల ఆఫీస్‌లన్నీ ప్రభుత్వ భవనాల్లోకి మారాలని ఆదేశిస్తూ ఆరు నెలల కిందట ప్ర భుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ఆఫీస్‌లు కలెక్టరేట్‌లోకి, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మారాయి. కానీ జీఎస్టీ ఆఫీస్‌ మాత్రం కరీంనగర్‌లోనే కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులకు సిరిసిల్లలో ప్రభుత్వ భవనాలు ఏవీ ఖాళీగా లేవని, జీఎస్టీ ఆఫీస్‌ ఏర్పాటుకు వసతులు సిరిసిల్లలో లేవని నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. పరోక్షంగా అధికారులు అక్రమంగా వ్యాపారాలు చేసే వారికే సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పనిచేసే చోట నివాసం ఉండాలనే సర్వీసు రూల్స్‌, కొత్త జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ భవనాల్లో ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలు జీఎస్టీ ఆఫీస్‌ విషయంలో బుట్టధాఖలు అవుతున్నాయి.

పరిధి ఎక్కువే..

రాజన్న సిరిసిల్ల జిల్లా 12 మండలాల పరిధిలో విస్తరించి ఉండగా.. జీఎస్టీ ఆఫీస్‌ పరిధి 15 మండలాల పరిధిలో ఉంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్‌, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు పరిపాలన సాగిస్తారు. కానీ జీఎస్టీ ఆఫీస్‌ పరిధి జగిత్యాల జిల్లా పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్‌, భీమారం మండలాలు కూడా ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఆ మూడు మండలాలు సైతం రాజన్నసిరిసిల్ల జిల్లా జీఎస్టీ ఆఫీసర్ల పరిధిలో ఉన్నాయి. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల నుంచి మేడిపల్లి వరకు, గంభీరావుపేట మండలం పెద్దమ్మ నుంచి బావుపేట వరకు సుధీర్ఘ పరిధి ఉన్నా జీఎస్టీ అధికారులు మాత్రం కరీంనగర్‌లోనే ఉంటున్నారు.

కార్యాలయంలోనే జీఎస్టీ ఆఫీసర్ల కాలక్షేపం

జిల్లా పరిధిలో పనిచేయాల్సిన జీఎస్టీ ఆఫీసర్లు కరీంనగర్‌లో కాలక్షేపం చేస్తున్నారు. జీఎస్టీ పన్నులను ఎగవేసే గ్రానైట్‌, మైనింగ్‌, హార్డ్‌వేర్‌, బీడీ కంపెనీలు, వస్త్రవ్యాపారులు, తునికాకు వ్యాపారులు, ఎలక్ట్రికల్‌ వాహనాల డీలర్లు, ఇతర వ్యాపారుల లావాదేవీలను పరిశీలిస్తూ జీఎస్టీ చెల్లింపులను పర్యవేక్షించాల్సిన అధికారులు ఆఫీస్‌కే పరిమితమవుతున్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో ఉండే చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వారి అసిస్టెంట్లు వ్యాపారుల లావాదేవీలను నమోదు చేస్తూ జీఎస్టీ ఆఫీస్‌లో అప్పగిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యాపారి ఫైల్‌కు ఓ లెక్క చొప్పున ముడుపులు సమర్పించడంతో అంతా ‘మామూలు’గానే జీఎస్టీ తనిఖీలు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జీఎస్టీ ఎగ్గొట్టే వ్యాపారులకు జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన ఆఫీసర్లు కరీంనగర్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా వైపు అప్పుడప్పుడూ వస్తున్నా మొక్కుబడి తనిఖీలతో ‘మామూళ్ల’ దందాను సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

సీజీఎస్టీ ఆఫీస్‌ ఉన్నా లేనట్లే !

జిల్లా కేంద్రంలోని భావనారుషినగర్‌(బ్యాంకు వీధి)లో సెంట్రల్‌ ఎకై ్సజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌(సీజీఎస్టీ) సూపరింటెండెంట్‌ ఆఫీస్‌ ఉంది. ఓ ప్రైవేటు అద్దె భవనంలో మొదటి అంతస్తులో ఓ చిన్న గదిలో సీజీఎస్టీ ఆఫీస్‌ ఉంది. కానీ అక్కడ సీజీఎస్టీ ఆఫీస్‌ ఉన్నట్లుగా ఎవరికీ తెలియకుండా బహిరంగంగా బోర్డు కూడా లేకుండా ఏర్పాటు చేశారు. బ్యాంకు భవనం లోపలికి వెళ్లితే మొదటి అంతస్తులో ఉన్నట్లు ఆరో మార్క్‌తో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. పైకి వెళ్లి పరిశీలిస్తే ఓ చిన్న గదిలో ఆఫీస్‌ ఉంది. అదీ కూడా తాళం వేసి ఉండడం విశేషం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఆఫీస్‌ సిరిసిల్లలో అద్దె భవనంలో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆఫీస్‌ మాత్రం కరీంనగర్‌లో కొనసాగడం గమనార్హం.

తిరుగులేని జీరో దందాలు

జిల్లాలో జీఎస్టీ ఆఫీస్‌ లేకపోవడం.. అధికారులు తనిఖీలకు రాకపోవడంతో జీరో దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి నెలా జిల్లాలో రూ.1.50 కోట్ల జీఎస్టీ స్వచ్ఛందంగా వసూలు అవుతుంది. అదే జీఎస్టీ అధికారుల చట్టబద్ధ తనిఖీలు ఉంటే ఆదాయం నెలకు రూ.3 కోట్లకు చేరుతుందని అధికార వర్గాల అంచనా. జిల్లాలో గ్రానైట్‌, బీడీల వ్యాపారులు, హార్డ్‌వేర్‌ దుకాణదారులు, నూలు వ్యాపారులు, వస్త్రోత్పత్తిదారులు ఇలా ఎవరికి వారు వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు. కొందరు వ్యాపారులు రెండు ఆధార్‌కార్డుల(చిన్న చిన్న అక్షరదోషాలతో ఆధార్‌ కార్డులు పొంది)తో ఆదాయ పన్నులను, జీఎస్టీ పన్నులను ఎగవేస్తున్నారు. ఏది ఏమైనా కరీంనగర్‌లో కొనసాగుతున్న జీఎస్టీ ఆఫీస్‌ సిరిసిల్లకు వస్తే అక్రమార్కుల ఆటలకు అడ్డుకట్ట పడి ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement