జిల్లాలో 2.44లక్షల ఎకరాల్లో పంటల సాగు 69వేల టన్నుల ఎరువుల వినియోగం బస్తాకు రూ.150 నుంచి రూ.350 వరకు పెంపు
చందుర్తి(వేములవాడ): యాసంగి పంటల సీజన్ ముగిసింది. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎరువుల ధరలను ఆయా కంపెనీలు అమాంతం పెంచేశాయి. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రభావం మన ప్రాంతంలో ఎరువులపై పడుతుంది. ఎరువులను బట్టి ఒక్కో బస్తాపై రూ.160 నుంచి రూ.400 వరకు పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 లోపు పెంచితే ఎరువుల ధరలు బస్తాకు వందల్లో పెరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో డీఏపీ, 28–28–0 ఎరువులు మినహాయించి అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి.
పెరుగుతున్న పెట్టుబడి
జిల్లాలో సుమారు 2.44 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో 1,86,400 ఎకరాల్లో వరి, 46,900 ఎకరాల్లో పత్తి, 10,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారుల ప్రణాళికలు చెబుతున్నాయి. ఈ పంటలకు 20,450.5 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 8,223.3 టన్నుల డీఏపీ, 11,021.6 టన్నుల పొటాష్, 29,374.8 టన్నుల యూరియాను కలుపుకుని 69,070 టన్నుల ఎరువులు వినియోగిస్తారని అంచనా. ప్రస్తుతం డీఏపీ, 28–28–0 ఎరువుల ధరలు నిలకడగానే ఉన్నాయి. మిగతా అన్ని రకాల ఎరువుల ధరలు పెరగడంతో జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.1.85కోట్ల భారం పడనుంది.
పంటల కొనుగోళ్లపై ఆంక్షలు
పంటల సాగులో పెరిగిన ఎరువుల బస్తాల ధరలతో సాగు భారంగా మారుతుందని రైతులు భావిస్తున్నారు. ఎరువుల ధరల పెరుగుదల, పంటల మద్దతు ధరలు మొక్కుబడిగా పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొంటున్నా 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తే ఆంక్షలు విధిస్తున్నారు. పత్తి ధర ఆశాజనకంగానే ఉన్న కొనుగోలు సమయంలో కొర్రీలు పెడుతుండడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. ప్రభుత్వ ప్రచారంతో రైతులు సన్న వడ్లు సాగుచేస్తున్నారు. అయితే సన్నాలకు చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తుండడంతో దిగుబడి పడిపోతుంది.
యాప్ తిప్పలు
గతంలో రైతులకు అవసరానికి తగ్గట్లుగా ఎరువుల బస్తాలను కొనుగోలు చేసి సాగులో వినియోగించుకునే వారు. ప్రస్తుతం ఎకరాకు ఒకటి లేదా రెండు బస్తాల నిబంధనలు విధించింది. అంతేకాకుండా యాప్ ద్వారా ఎరువులు కొనాలనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం తప్పిదాలతో ధరణిలో రైతులకు చిక్కులు ఎదురుకావడంతో పూర్తి స్థాయిలో భూములు ఆన్‌లైన్ కాలేవు. భూభారతితో అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో పలువురు రైతులకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల బస్తాలు అందడం లేదు. వ్యవసాయాధికారులతో పంటల సాగుపై సర్వే చేయించి, యాప్‌తో సంబంధం లేకుండా ఎరువుల బస్తాలు అందించాలని రైతులు కోరుతున్నారు.
ఎరువు పాత ధర ప్రస్తుత ధర
డీఏపీ రూ.1,350 రూ.1,350
28–28–0 రూ.1,850 రూ.1,850
పొటాష్ రూ.1,800 రూ.1,975
20–20–0–13 రూ.1,400 రూ.1,800
14–35–14 రూ.2,150 రూ.2,350
10–26–26 రూ.1,200 రూ.1,700
12–32–16 రూ.2,025 రూ.2,250
సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూ.600 రూ.775
16–16–16 రూ.1,675 రూ.2,050
24–24–0 రూ.2,000 రూ.2,350


