● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రతీ సోమవారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌ల్లోనూ ఆర్డీవోలు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోనూ ప్రజావాణి ఎప్పటిలాగే కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
హనుమాన్ జయంతికి ఏర్పాట్లు
వేములవాడ: ఈనెల 12న జరిగే హనుమాన్ జయంతికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వివిధ శాఖల అధికారులు, అర్చకులతో తన చాంబర్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. భీమేశ్వరస్వామి, నగేశ్వరస్వామి, హనుమాన్ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. డీఈవో భాస్కర్, ఈఈ రాజేశ్, ఏఈవోలు శ్రవణ్, జయకుమారి, అశోక్, స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ పాల్గొన్నారు.
పొద్దుతిరుగుడు కొనుగోలు చేయండి
ఇల్లంతకుంట(మానకొండూర్): నామమాత్రపు పొద్దుతిరుగుడును కొనుగోలు చేసి తమ టార్గెట్ అయిపోయిందని చేతులు దు లుపుకోవడం సరికాదని రైతులు పండించిన మొత్తం పొద్దు తిరుగుడును కొనాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో పేరుకుపోయిన పొద్దు తిరుగుడు నిల్వలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. మండలంలో 2400 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి టార్గెట్ అయిపోయిందనడం సరికాదన్నారు. ముస్కానిపెట, ఇల్లంతకుంట ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించా రు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, నాయకులు కమటం రాములు, బొల్లం వెంకటేశం, ఉడుతల వెంకటేశం, చెరుకు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పున్నం చందర్‌కు పురస్కారం
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన సైకాలజిస్టు పున్నం చందర్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. మానసిక ఆరోగ్య రంగంలో పదహారేళ్లుగా విశేష సేవలందిస్తున్న పున్నంచందర్‌కు ‘మైండ్ అండ్ మెరిట్ అవార్డ్’ వరించింది. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ద శాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందజేశారు.
ధాన్యం కొనుగోలు చేయాలి
సిరిసిల్ల అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. కోతలు కోసి 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈనెల 11న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, అన్నల్‌దాస్ గణేశ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ఆలయానికి విరాళం
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణకు హైదరాబాద్‌కు చెందిన గోరింకల సుగుణ రూ.లక్ష, కరీంనగర్‌కు చెందిన శ్రీరాముల సత్తమ్మ రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈవో పేర్కొన్నారు.


