దొరికిన దొంగలు? | - | Sakshi
Sakshi News home page

దొరికిన దొంగలు?

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

ధ్రువీకరించని పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో జల్లెడ బిహార్‌ నుంచి కరీంనగర్‌కు తరలింపు పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసులో పురోగతి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌ పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్‌ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలు కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్‌ నుంచి కరీంనగర్‌ తీసుకొస్తున్నట్లు తెలిసింది.

ప్రత్యేక బృందాలతో...

ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్‌లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.

బిహార్‌లో నగలు విక్రయిస్తుండగా

దర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్‌ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్‌ బైక్‌ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్‌, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించి న సమాచారంతో బిహార్‌ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement