● నేడు ఎన్పీడీసీఎల్ బోర్డు ఏర్పాటు
సిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆఫీస్ ముందున్న బోర్డును తొలగించేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 56 ఏళ్ల కిందట స్థాపించిన ‘సెస్’సంస్థ ఉనికి కోల్పోనుంది. మూడు లక్షల సభ్యత్వాలు గల ‘సెస్’ సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించకుండా.. ఏప్రిల్ 1న ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేశారు. ఈమేరకు వ్యాపార లైసెన్స్ లేని ‘సెస్’ సంస్థను ఎన్పీడీసీఎల్ అధికారులు స్వాధీనం చేసుకుని విద్యుత్ పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘సెస్’సంస్థకు ఎన్నికై న పాలకవర్గానికి మరో 19 నెలలు పాలనపరమైన గడువు ఉంది. కానీ ఎన్పీడీసీఎల్ అధికారులు పాలకవర్గం జోలికి వెళ్లకుండానే ‘సెస్’ సంస్థ ఉద్యోగులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ‘సెస్’పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై ప్రభుత్వం, ఎన్పీడీసీఎల్ అధికారులు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయడంతో విచారణ కోర్టులో కొనసాగుతోంది. ఇదే సమయంలో జిల్లాలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని సంస్కరణలను అమలు చేస్తున్నారు. కొత్త సబ్‌స్టేషన్లు, మిడిల్ పోల్స్, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు.
బోర్డును మార్చేందుకు ఏర్పాట్లు
సెస్ బోర్డును మార్చేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెండ్, సిరిసిల్ల సర్కిల్‌గా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. సోమవా రం బోర్డును మార్చుతారని అధికారుల ద్వారా తెలి సింది. ఏది ఏమైనా ‘సెస్’ పాలకవర్గాల అవినీతి, అక్రమాలు, నిర్వహణ లోపాలు, ప్రభుత్వ బకాయిలు, పాలకుల రాజకీయ కుట్రలతో 56 ఏళ్ల సంస్థ ఉనికి కోల్పోతుంది. ఇప్పటికే జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలను అందిస్తున్న ఎన్‌పీడీసీఎల్ తాజా పరిణామాలతో పూర్తి స్థాయిలో ‘సెస్’ సంస్థను హస్తగతం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.


