అనుమానితులతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అనుమానితులతో అప్రమత్తంగా ఉండాలి

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

● స్వీయ గణనకు నేడు తుది గడువు ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● స్వీయ గణనకు నేడు తుది గడువు ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్‌: పదేళ్లకోసారి నిర్వహించాల్సిన జనగణన ఈసారి చాలా ఏళ్ల తరువాత జరుగుతుందని, జనగణన పేరుతో ఎవరైనా అనుమానితులు మీ ఇంటికొచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. జిల్లా కేంద్రంలో స్వీయ జనగణనపై శనివారం అవగాహన వాక్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీచేసిన గుర్తింపుకార్డుల మీద క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిని స్కాన్‌ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌లో పొందిపరిచిన వారి వివరాలు వస్తాయని తెలిపారు. స్వీయగణనకు ఆదివారం చివరి అవకాశమని స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వస్తారని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, ముఖ్య ప్రణాళికాధికారి పీ.బీ.శ్రీనివాసాచారి, కమిషనర్‌ ఖదీర్‌పాషా, జిల్లా అధికారులు అఫ్జల్‌బేగం, సౌజన్య, లక్ష్మీరాజం, స్వప్న, తహసీల్దార్‌ జయంత్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, ఎస్‌వో సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించి తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని రగుడులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కేంద్రంలో రైతుల సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మిల్లుల్లో జాప్యం చేయకుండా అన్‌లోడ్‌ అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. డీఎస్‌వో బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, డీఏవో అప్టల్‌ బేగం, సహకారశాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మిర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, తహసీల్దార్‌ జయంత్‌ పాల్గొన్నారు.

11 నుంచి 17 వరకు

విద్యాశాఖ వారోత్సవాలు

ఈనెల 11 నుంచి 17 వరకు విద్యాశాఖ వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీఐఈవో శరత్‌, సీపీవో శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement