● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: పార్టీ కోసం పనిచేసినోళ్లకు గుర్తింపు దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం ఎస్సీసెల్ అధ్యక్షుడి పదవి కోసం జరిగిన దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్ పరిశీలకులు కొరివి అరుణ్‌కుమార్ పరిశీలించారు. పార్టీలో మూడేళ్లకు పైగా పనిచేసిన అనుభవం, నిబద్ధత గల వారికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, జిల్లా ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు మేకల కమలాకర్ పాల్గొన్నారు.
సమాజ సేవకులకు చేయూతనిద్దాం
ముస్తాబాద్(సిరిసిల్ల): స్వార్థం లేకుండా సమాజం కోసం పనిచేసే వారికి చేతనైనంత చేయూతనందించాలని సర్ధాపూర్ 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్ పేర్కొన్నారు. మండలంలోని గూడెం అన్నపూర్ణమ్మ ఫౌండేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను శుక్రవారం అందజేశారు. రాందాస్ మాట్లాడుతూ ఏడుగురు సాధారణ మహిళలు ఆరు నెలలుగా 60 మంది పేదలు, వృద్ధులకు రెండు పూటల భోజనాలు అందించడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు కుర్ర సావిత్రి, బొప్ప విజయ, దేవేందర్, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల హక్కులను కాపాడాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని లోక్ అదాలత్ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేణు మాట్లాడుతూ పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణ, లైంగిక వేధింపుల నివారణ లక్ష్యంగా సురక్షిత్ బచ్‌పన్ సురక్షిత్ భవిష్యత్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్.మల్లేశ్‌యాదవ్, లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా
వేములవాడ: కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనాలపై బీజేపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం వేములవాడలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, వాసాల శ్రీనివాస్, కందుల క్రాంతికుమార్, గన్నమనేని రామారావు, కొండ కనకయ్య, నీలం శేఖర్, నీరటి మల్లేశం, అంజద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీవోగా లక్ష్మీనారాయణ
సిరిసిల్ల: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్‌డీవో)గా కె.లక్ష్మీనారాయణను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీవోగా ఉన్న లక్ష్మీనారాయణకు పదోన్నతి కల్పిస్తూ డీఆర్‌డీవోగా నియమించారు.


