రంగంపేట రైతుల ధాన్యం విక్రయాల్లో ఇబ్బంది గతంలో పట్టాలు ఇచ్చిన కేటీఆర్ ధాన్యం అమ్ముకోలేక తిప్పలు
వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం పట్టాలిచ్చిందని సంతోష పడాలో.. ఆన్‌లైన్‌లో వివరాలు లేవని బాధపడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు రైతులు. అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భూమి పట్టాలు అందుకున్న రైతులు.. తమ బతుకులు బాగుపడతాయని సంబరపడ్డారు. కానీ చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే భూముల వివరాలు ఆన్‌లైన్‌లో లేక ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో భూముల వివరాలు లేకపోవడంతో ధాన్యం కొనబోమంటూ ఐకేపీ అధికారులు తెలపడంతో ఏం చేయాలో తెలియక రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట రైతులు దిక్కులు చూస్తున్నారు.
ఆనందం ఆవిరి
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అప్పటి కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో రంగంపేటలో పలువురి రైతులకు భూ పట్టాలు పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారుల సంతకాలతో కూడిన అధికారిక పహాణి ప్రతులను రైతులకు మంత్రి అందజేశారు. దీంతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతోపాటు ధాన్యం విక్రయాల్లో తమ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు ఆశపడ్డారు.
ఆన్‌లైన్‌లో కనిపించని వివరాలు
ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ధాన్యం తూకం వేసే సమయంలో సర్వేనంబర్లు ఆన్‌లైన్‌లో చూపించడం లేదంటూ ఐకేపీ నిర్వాహకులు చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. అప్పటి మంత్రి చేతుల మీదుగా, రెవెన్యూ అధికారుల సంతకాలతో అందిన పట్టాలు ఉన్నప్పటికీ, డిజిటల్ రికార్డుల్లో నమోదు కాకపోవడం ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. ఈ సమస్యపై ఏపీఎం దేవరాజు, ఏఈవో ఫాజిల్‌ను వివరణ కోరగా.. కేవలం రైతుబంధు వస్తున్న రైతుల ధాన్యాన్ని మాత్రమే ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నామని, ఈ సమస్య రెండు రోజులలో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు.


