కొనుగోలు చేయని మార్కెటింగ్ అధికారులు దోచుకుంటున్న దళారులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్న రైతులు
ఇల్లంతకుంట(మానకొండూర్): సన్‌ఫ్లవర్(పొద్దు తిరుగుడు) అమ్మకాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో నర్సక్కపేట, ముస్కాన్‌పేట, పత్తికుంటపల్లి, గాలిపెల్లి, ఆరేపల్లె, రేపాక గ్రామాల్లో రబీ సీజన్లో 1600 ఎకరాల్లో సన్‌ఫ్లవర్ సాగు చేశారు. పంట దిగుబడి అధికంగా రావడంతో రైతులు ఏఎంసీ కేంద్రానికి పొద్దతిరుగుడు ఉత్పత్తులను తీసుకొచ్చారు. మార్కెట్‌శాఖ అధికారులు మాత్రం కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
రైతుల వద్దే దిగుబడులు
మండలంలో సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 2,393 క్వింటాళ్ల పొద్దుతిరుగుడును 163 మంది రైతుల నుంచి మార్కెటింగ్ అధికారులు కొనుగోలు చేశారు. ఇంకా ఇల్లంతకుంట ఏఎంసీ షెడ్లలో 8 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. రైతుల ఇండ్లలో మరో 8 వేల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు తెలిసింది. అధికారులు మా త్రం తమ టార్గెట్ పూర్తయింందని చెబుతున్నారు.
దండుకుంటున్న దళారులు
ప్రభుత్వం క్వింటాల్ పొద్ద తిరుగుడుకు మద్దతు ధర రూ.7,721 పెడుతుంది. అయితే ప్రైవేట్ వ్యా పారులు మాత్రం క్వింటాల్‌కు రూ.5,500 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ ఒక్కో క్వింటాల్‌కు రూ.2వేలకు పైగానే నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన మద్దతు ధర కు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


