పోలీసులకు సవాల్‌గా మారిన చోరీ ఘటన 27 రోజులుగా ఆచూకీ కోసం పోలీసుల వేట లభించని ఆధారాలు సీసీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చర్యలు కరీంనగర్ ఘటనతో స్థానిక పోలీసులు అప్రమత్తం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం మిషన్ దొంగతనం సంఘటన ఇంకా కొలిక్కి రాలేదు. చోరీ జరిగి 27 రోజులు గడుస్తున్నా దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. గత నెల 11న అర్ధరాత్రి సంఘటన జరుగగా.. ఇప్పటి వరకు దొంగలకు సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు. ఇప్పటికీ పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.
వరుస ఘటనలతో భయం..భయం
ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగల ఆచూకీ కోసం జిల్లా పోలీసులు మొదట్లో ఒక డీఎప్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైల ఆధ్వర్యంలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు మహారాష్ట్రతోపాటు సరిహద్దు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ జ్యువెల్లరీ షాప్‌లో జరిగిన దొంగతనం సంఘటనతో ఏటీఎం మిషన్ చోరీ ఘటనను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అసలే వేసవికాలం.. అందరూ ఆరుబయట పడుకునే అవకాశం ఉందని.. ఇదే అదునుగా దొంగలు తెగబడితే పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు.
అపరిచిత వ్యక్తులపై నిఘా
గ్రామాల్లో సంచరిస్తున్న అపరిచితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. గ్రామాల్లోకి సంబంధం లేని వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని ఇప్పటికే పోలీసులు ప్రచారం చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, కొత్త వ్యక్తుల సంచరిస్తే ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఏటీఎం మిషన్ చోరీ విషయంలో కూడా అపరిచితులు వారం ముందు నుంచే రెక్కి నిర్వహించారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
సరిహద్దుల్లో ఇప్పటికీ తనిఖీలు
జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌ల వద్ద ఇప్పటికీ దొంగల కోసం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జ్యువెల్లరీ దొంగలతోపాటు ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లి వారిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు.


