ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని రైస్‌మిల్లర్లను, ప్యాడీసెంటర్ల సిబ్బందిని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండలంలోని చింతలకుంటపల్లె, తాళ్లపల్లి గ్రామాల రైస్‌మిల్లులను అనంతారం, పెద్దలింగాపురం, రామాజీపేట ప్యాడీసెంటర్లను గురువారం సందర్శించి మాట్లాడారు. లారీల కొరత ఉంటే స్థానికంగా ఉండే ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. పెద్దలింగాపురం కొనుగోలు సెంటర్లో రైతులు లారీల కొరత తీవ్రంగా ఉందని అన్‌లోడింగ్ సమస్య ఉందని అడిషనల్ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. తహసీల్దార్ సురేష్, సర్పంచ్ మామిడి రాజు, ఏపీఎం కుమారస్వామి, ఆర్‌ఐ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
లారీల కోసం రోడ్డెక్కిన రైతులు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఏర్పడడంతో గురువారం పలువురు రైతులు కొదురుపాక చౌరస్తాలో పడిగాపులు కాశారు. లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు రావా లని కోరారు. రైతులకు మద్దతుగా బీజేపీ మండల నాయకులు కొనుకటి హరీశ్ లారీ లను కేంద్రాలకు మళ్లించేందుకు ప్రయత్నించారు. ఆర్‌ఐ మనోజ్ సైతం లారీలు కేంద్రాలకు పంపేందుకు ప్రయత్నించారు.
బీడీ కార్మికులకు పెరిగిన వేతనం
ముస్తాబాద్(సిరిసిల్ల): బీడీలు చుట్టే కార్మికురాలితోపాటు ఇతర విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు మూల వేతనం పెంచుతూ బీడీ కంపెనీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కార్మిక సంఘాలకు, బీడీ కంపెనీ యజమాన్యాల మధ్య గురువారం చర్చలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ నారాయణ తెలిపారు. నూతన ఒప్పందంలో బీడీ కార్మికురాలికి రూ.6 పెంచడంతో వెయ్యి బీడీలకు వేతనం రూ.275.24 అయ్యిందని తెలిపారు. ప్యాకర్లకు మూల వేతనం రూ.4,500, బట్టి కార్మికులు, టేబుల్ క్లర్కులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2200 పెరిగిందని వివరించారు. పెరిగిన వేతనాలు మే నుంచి వర్తిస్తాయని తెలిపారు.
బీఆర్‌ఎస్ నేతల అరెస్టు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నా యకుల అరెస్ట్ నేపథ్యంలో నిరసనలు మిన్నంటాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ పట్టణ అ ధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ సహా పలువురు నేతలను పోలీసులు గురువారం ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఎలుక వెంకన్న, నంది శంకర్, అన్నారం శ్రీనివాస్, సబ్బని హరీశ్ పాల్గొన్నారు.
సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లాలి
సిరిసిల్ల: జిల్లా పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకుని, సీజ్ చేసిన వాహనాలను యజమానులు తీసుకెళ్లాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. 15 వాహనాలను జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆరు నెలల్లోపు సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. గడువులోగా తీసుకెళ్లకపోతే నిబంధనల ప్రకారం వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 87126 56428, 90009 10619లో సంప్రదించాలని తెలిపారు.


