స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే ధైర్యం కూటమికి లేదు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు, కౌన్సిలర్లను గెలిపించాలని వినతి
కందుకూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, పేదల పక్షాన నిలిచే వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌తో కలిసి పట్టణంలోని కోటకట్టవీధి, అజ్మల్‌హుస్సేన్ హాస్పిటల్ ఏరియా, పోతురాజుమిట్ట, జనార్దనకాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాల మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అమ్మఒడి, గతంలో వైఎస్ జగన్ అమలు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలను నిలిపివేయడమే కాకుండా కొత్త పథకాల పేరుతో మోసం చేశారన్నారు. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే ధైర్యం లేక నామినేషన్ల చించివేత, రిగ్గింగ్, బైండోవర్ కేసులు, ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేదలకు అండగా ఉండే బుర్రా మధుసూదన్‌యాదవ్ నాయకత్వంలో బీసీ వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావుతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అధికార అహంకారానికి గుణపాఠం చెప్పాలి
అనంతరం బుర్రా మధుసూదన్‌యాదవ్ మాట్లాడుతూ.. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్‌లు ‘దోచుకో దాచుకో’ అవినీతి పాలన సాగిస్తున్నారని, కందుకూరు నియోజకవర్గం అవినీతిలో మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. నామినేషన్లు చించివేయడం, స్క్రూట్నీలో తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, ప్రచారం చేయనీయకుండా అరెస్టులు, బైండోవర్ కేసులతో బెదిరించడం వంటి అరాచకాలకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెరవకుండా 40 వార్డుల్లో 100 నామినేషన్లు వేశారన్నారు. మళ్లీ జగన్ సంక్షేమ పాలన రావాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ముస్లింలకు 11 సీట్లు ఇచ్చామని, గెలిచాక వైస్‌చైర్మన్ పదవిని ముస్లింలకే ఇస్తామని ప్రకటించారు. కోటీశ్వర్లు, అధికారులు, పోలీసులను నమ్ముకున్న టీడీపీని ఓడించి, పేదల పక్షాన నిలిచే వైఎస్సార్‌సీపీని ఆదరించాలని కోరారు.
24వ వార్డులో అపూర్వ స్వాగతం
సోమవారం రాత్రి 24వ వార్డులోని అజ్మల్‌హుస్సేన్ హాస్పిటల్ నుంచి పోతురాజుమిట్ట వరకు హఫీజ్‌ఖాన్, బుర్రా మధుసూదన్‌యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి షేక్ మహబూబ్‌భాషా, కార్యకర్తలు, స్థానికులు బాణసంచా కాల్చి, గజమాలలతో నాయకులకు ఘన స్వాగతం పలికారు.


