పెండింగ్‌ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయండి

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

పెండింగ్‌ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయండి జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో సత్తాచాటిన మెడికోలు జిల్లా న్యూక్లియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా నాయక్‌ పోలింగ్‌ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు

ఒంగోలు సబర్బన్‌: పెండింగ్‌లో ఉన్న ఓటర్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియ పురోగతిపై ఆయన ఆరా తీశారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి హాజరయ్యారు. అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో స్థానం పొందని వారికి అవకాశం, ఓటరు చిరునామా మార్పు, చనిపోయిన, డూప్లికేట్‌ ఓటర్ల తొలగింపు, బీఎల్‌ఓతో బుక్‌ చేసుకున్న కాల్‌ పరిష్కరించడంలో జిల్లా పురోగతిని కలెక్టర్‌ ఈ సందర్భంగా వివరించారు. మొత్తం కలిపి సుమారు 6 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వీటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఈఓకు తెలిపారు. ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో సంతనూతలపాడు ఈఆర్వో మాధురి, కొండపి ఈఆర్‌ఓ రవికుమార్‌, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఒంగోలు టౌన్‌: జాతీయ స్థాయిలో నిర్వహించిన వాలీబాల్‌ పోటీల్లో ఒంగోలు మెడికల్‌ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. ప్రతిభ కనపరిచి తృతీయ స్థానంలో నిలిచారు. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీవాణి తెలిపిన వివరాల ప్రకారం... నవంబంర్‌ 19 నుంచి 24వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌ ఎయిమ్స్‌లో ఎస్‌పీ ఎరా–2026 క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఒంగోలు మెడికల్‌ కాలేజీకి చెందిన వాలీబాల్‌ జట్టు పాల్గొంది. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో హోరాహోరీగా జరిగిన పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒంగోలు మెడికల్‌ కాలేజీకి పేరు తీసుకొచ్చారని ప్రిన్సిపాల్‌ శ్రీవాణి అభినందించారు. సోమవారం కాలేజీలోని తన చాంబర్లో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యలో రాణించడంతో పాటుగా క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయని, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంచుతాయని తెలిపారు. వాలీబాల్‌ జట్టు విజయానికి కృషి చేసిన ఫిజికల్‌ డైరక్టర్‌ బి.రాధాకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో విజేతలు ఎన్‌.గోపీచంద్‌, ఎం.హరిప్రసాద్‌, రామ్‌ ప్రసాద్‌రెడ్డి, నందకుమార్‌, రవితేజ, గణేష్‌, జయవర్థన్‌ కుమార్‌, కిరణ్‌, స్వాత్విక్‌, వరగణేష్‌లతో పాటుగా కళాశాల వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ మస్తాన్‌ ఖాదర్‌, డాక్టర్‌ చంద్రకళ పాల్గొన్నారు.

మార్కాపురం: జిల్లా న్యూక్లియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ వెంకటేశ్వర నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, టీబీ, క్యాన్సర్‌ పేషంట్లకు అందుతున్న చికిత్స, వారి ఆరోగ్య పరిస్థితి, వారికి కావాల్సిన మందులు తదితర అంశాలను డాక్టర్‌ నాయక్‌ జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తారు. డాక్టర్‌ నాయక్‌ గతంలో మార్కాపురం పట్టణంలో అర్బన్‌ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా సేవలందించారు. అనంతరం యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల పీహెచ్‌సీలో కూడా డాక్టర్‌గా వైద్యసేవలు అందించారు.

నెహ్రూనగర్‌: గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల సాధారణ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు పోలింగ్‌ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు గుంటూరు జోన్‌ సంయుక్త కార్మిక కమిషనర్‌ ఆషారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 (గురువారం), 29 (ఆదివారం), డిసెంబర్‌ 2 (బుధవారం) పోలింగ్‌ తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. గుంటూరు జోన్‌ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల యాజమాన్యాలు ఈ నిబంధనను పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement