అధికార మదం.. అరాచక పర్వం! | - | Sakshi
Sakshi News home page

అధికార మదం.. అరాచక పర్వం!

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌/కొండపి/కొనకనమిట్ల/అద్దంకి:

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏకపక్షంగా కై వసం చేసుకునేందుకు అధికార టీడీపీ నేతలు బరితెగించి దమనకాండకు పాల్పడుతుంటే, రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాత విధులు నిర్వర్తించాల్సిన ఎన్నికల అధికారులు, పోలీసులు వారి కనుసన్నల్లో కీలుబొమ్మలుగా మారారు. మర్రిపూడి, కొండపి, కొనకనమిట్ల, బల్లికురవ మండలాల్లో నామినేషన్‌ పత్రాల చించివేత, ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవ డ్రామాలు, గుర్తుల కేటాయింపులో ఉద్దేశపూర్వక జాప్యం, అభ్యర్థులకు ప్రాణహాని బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఖాకీలు బాధితులపైనే నిర్బంధాలు విధిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.

అధికారా.. టీడీపీ ఏజెంటా?

మర్రిపూడి మండలం కూచిపూడి నామినేషన్‌ కేంద్రం (కూచిపూడి, వేమవరం, గార్లపేట పంచాయతీలు) ఆర్వో, జువ్విగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌కే మధార్‌వలి మంత్రి స్వామి, దామచర్ల సత్య ఆదేశాలకు తలొగ్గి టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరించారు. మండలంలోని ఆరు నామినేషన్‌ కేంద్రాల్లో ఐదుగురు ఆర్వోలు ఈ నెల 21వ తేదీ శనివారం విత్‌డ్రా ముగియగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా, మధార్‌వలి మాత్రం వేమవరం, గార్లపేట ఏకగ్రీవమని ప్రకటించి, కూచిపూడి సర్పంచ్‌ అభ్యర్థి ఉండేల శ్రీరాములుకు గుర్తు ఇవ్వకుండా మొహం చాటేశారు. ఆదివారం ఎంపీడీఓ కార్యాలయ అధికారులు నాటకాలు ఆడుతూ కాలయాపన చేయడంతో ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగాయి. మండల ఎన్నికల అధికారి అర్జున్‌నాయక్‌ హెచ్చరించినా బేఖాతరు చేసిన ఆర్వో, కలెక్టర్‌ జోక్యంతో ఎట్టకేలకు సోమవారం శ్రీరాములుకు మంచం గుర్తు కేటాయించారు. ఆలస్యంగా గుర్తు ఇవ్వడంతో పంచాయతీలో ప్రతి ఓటరునూ కలిసి ఓటు అభ్యర్థించే అవకాశం లేకుండా చేశారని శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వేమవరంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్లు తిరస్కరించిన ఆర్వో, టీడీపీ సానుభూతిపరులైన చెన్నిపాటి రమాదేవి, గుదే సుశీల నామినేషన్లు ఆమోదించి, రమాదేవి ఏకగ్రీవమైనట్లు లిఖితపూర్వకంగా అందజేశారు. అయితే వారిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మంత్రి స్వామి ఆదేశాలతో సోమవారం ఇద్దరూ బరిలో ఉన్నట్లు ప్రకటించి గుర్తులివ్వడంపై టీడీపీ శ్రేణులే విస్తుపోయాయి. లిఖితపూర్వక పత్రం ఇచ్చి ఇప్పుడు తిరిగి ఎన్నిక పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేసిన రమాదేవి న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఆర్వో తీరుపై శ్రీరాములు, రమాదేవి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవ హైడ్రామా

కొండపి మండలంలోని 18 పంచాయతీలకు ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎంపీడీఓ రామకృష్ణ శనివారం అర్ధరాత్రి 11 గంటలకు మీడియా వాట్సాప్‌ గ్రూపులో గుర్రప్పడియ ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అయితే తాను నామినేషన్‌ ఉపసంహరించుకోలేదని, కొందరు కావాలనే ఫోర్జరీ సంతకాలు చేశారని జనసేన అభ్యర్థి ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో ఆదివారం రాత్రి 9 గంటలకు శనివారం నాటి సమాచారాన్ని గ్రూపుల నుంచి డిలీట్‌ చేసిన ఎంపీడీఓ, గుర్రప్పడియలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పత్రాలు చించివేత.. బాధితుల నిర్బంధం

ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ బ్యాచ్‌ బరితెగించింది. కొనకనమిట్ల మండలం ఇరసలగుండం ఆరో వార్డుకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు రాచమళ్ల పుల్లారెడ్డి సోమవారం తన ప్రతిపాదితుడితో కలిసి పెదారికట్ల నామినేషన్‌ కేంద్రం లోపలికి వెళ్లి అధికారులకు పత్రాలు సమర్పిస్తుండగా టీడీపీ నేతలు ఉండేల సుబ్బారెడ్డి, చిలకల గురవారెడ్డి, నీలం శ్రీనివాసులరెడ్డి వాటిని లాక్కొని చించిపారేశారు. పుల్లారెడ్డి కేకలు వేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొద్దిసేపటికే వదిలేసి, తిరిగి నామినేషన్‌ వేయనీయకుండా బాధితుడైన పుల్లారెడ్డినే సాయంత్రం వరకు స్టేషన్‌లో నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే మండలం చినారికట్లలో నామినేషన్ల తొలి రోజు శనివారం సాయంత్రం నామినేషన్లు వేసి వస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల కార్లను టీడీపీ నేతలు అడ్డగించి అద్దాలు పగలగొట్టి హంగామా సృష్టించారు. గ్రామంలో మూడు రోజులుగా 144 సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ సోమవారం పొలానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త కోటిరెడ్డిని టీడీపీ నేత వెంకటస్వామి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కనిగిరి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజేష్‌కుమార్‌ గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే కారు అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించిన వారిని వదిలేసి ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు ఏకపక్షంగా స్టేషన్‌కు తరలించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ఎట్టకేలకు కూచిపూడి సర్పంచ్‌ అభ్యర్థి శ్రీరాములుకు కేటాయించిన మంచం గుర్తు

పెదారికట్లలో నామినేషన్‌ పత్రాలను చించి బయటకు వస్తున్న టీడీపీ నేత

పంచాయతీ నామినేషన్ల చివరి రోజున టీడీపీ నేతల బరితెగింపు

నామినేషన్‌ పత్రాల చించివేత, ఫోర్జరీ సంతకాలు..

విత్‌డ్రా చేయకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు..

అట్రాసిటీ కేసుల పేరుతో బ్లాక్‌మెయిల్‌

నిబంధనలకు తూట్లు పొడిచిన అధికారులు

పలుచోట్ల ఏకగ్రీవమంటూ ప్రకటించి ఆపై యూటర్న్‌

ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు.. బాధితుల అక్రమ నిర్బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement