నూతన కార్పొరేటర్లకు జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన 11 మంది కార్పొరేటర్లు
ఒంగోలు సిటీ: ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్పొరేటర్లు పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచించారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ తరఫున నూతనంగా కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపడుతున్న 11 మంది నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందిన కార్పొరేటర్లు వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను గుర్తించి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధిలైట్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని, పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, 1వ డివిజన్ కార్పొరేటర్ గరికిముక్కల రాణి ప్రియాంక, 4వ డివిజన్ కార్పొరేటర్ సుబేదార్ హజరత్, 13వ డివిజన్ కార్పొరేటర్ అంబటి అర్జునన్, 14వ డివిజన్ కార్పొరేటర్ పట్రా మేరీ, 16వ డివిజన్ కార్పొరేటర్ గొర్రెముచ్చు సలోమి, 24వ డివిజన్ కార్పొరేటర్ దాసరి వెంకటేశ్వర్లు, 29వ డివిజన్ కార్పొరేటర్ కావటి రవికుమార్, 39వ డివిజన్ కార్పొరేటర్ పూనూరి సౌజన్య, 49వ డివిజన్ కార్పొరేటర్ సుమన్, 54వ డివిజన్‌న్ కార్పొరేటర్ ఎదురు మాల్యాద్రి, 55వ డివిజన్ కార్పొరేటర్ పల్నాటి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.


