ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

పోలీసుల అండతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు నామినేషన్ల నుంచి ఉపసంహరణల వరకు అధికార పార్టీ అరాచకాలు కలెక్టర్‌ దృష్టికి సంతనూతలపాడు నియోజకవర్గ సమస్యలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ అపహాస్యం చేస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున విమర్శించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌ రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల తీరుపై కలెక్టర్‌కు పలు అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల సమయంలోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేసుకోనీయకుండా భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నామినేషన్ల నుంచి ఉపసంహరణల వరకు అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలోనూ అదే విధానం కొనసాగిందన్నారు. పోలీసులు నేరుగా అభ్యర్థుల వద్దకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని, లేదంటే ఎన్నికల్లో పాల్గొనలేరంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఇలాంటి రాజకీయ విధానాలను ఎప్పుడూ అనుసరించలేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయో గుర్తించి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరిస్తే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. దర్శి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. భయభ్రాంతులకు గురిచేసి గెలిచినా అది నిజమైన ప్రజా విజయమవుతుందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో రెండున్నరేళ్లుగా అభివృద్ధి పనులు చేపట్టకుండా ఎన్నికల సమయంలో హడావుడిగా పనులు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మరో రెండున్నరేళ్లకే పరిమితమవుతుందని, అనంతరం జరిగే ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు మేరుగు నాగార్జున తెలిపారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, సంతనూతలపాడు ఎంపీటీసీ దుంపా రమణమ్మ, సంతనూతలపాడు సర్పంచ్‌ అభ్యర్థి అనూరాధ, మహిళా నాయకురాలు కుంచాల రమణమ్మ, వైఎస్సార్‌ సీపీ నాయకులు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement