● రాష్ట్ర సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ఒంగోలు సబర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బి.సాయి ప్రసాద్, పీఆర్ అండ్ ఆర్డీ స్పెషల్ సీఎస్ కాంతిలాల్ దండే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణ తేజ తదితరులతో కలిసి కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సంబంధిత అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పి.రాజాబాబు కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను విధిగా పాటించాలని ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ అధికారులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, సిఫార్సులను ఆమోదించవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి 2011 సెన్సెస్ గణాంకాలను ఆధారంగా చేసుకోవాలని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అందులో భాగంగా పోలింగ్ సిబ్బంది ఏర్పాటు , రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్ నియామకం చేపట్టాలన్నారు. వార్డు, మండలం జిల్లాలకు సంబంధించి నివేదికలను త్వరితగతిన ఇవ్వాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిరంజీవి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, డీపీఓ అనుపమ ఇతర అధికారులు పాల్గొన్నారు.


