● సీఆర్డీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నత స్థాయి టీమ్తో కలెక్టరేట్లో సమీక్ష
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వం చేపడుతున్న ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రకాశం జిల్లా సమగ్ర స్వరూపాన్ని మార్చేందుకు పటిష్టమైన చర్యలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సీఆర్డీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఉన్నతస్థాయి అధ్యయన బృందంతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్మిత జె కుట్టుకట్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల నిపుణుల టీమ్ జిల్లాలోని ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం చేయడానికి ఒంగోలు వచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవ రంగం అపారమైన అభివృద్ధి అవకాశాలను వెలికితీయడం, ఇక్కడి సహజ సిద్ధమైన వనరులను అమరావతి రీజియన్లోని పొరుగు జిల్లాల వనరులతో అనుసంధానించడమే ఈ నివేదిక ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణంతో పాటు దానికి అవసరమైన అనుబంధ మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామిక పురోగతికి, మౌలిక సదుపాయాల విస్తరణకు, పెట్టుబడుల ఆకర్షణకు అడ్డంకిగా మారిన క్షేత్రస్థాయి సాంకేతిక, ఆర్థిక ప్రతిబంధకాలను తొలగించడంపై కలెక్టర్ స్వయంగా సమగ్ర డేటా, గ్రాఫికల్ విశ్లేషణతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ అధ్యయన బృందం ప్రభుత్వానికి ఒక నమూనా నివేదిక సమర్పిస్తుందని, దాని ఆధారంగా జిల్లా ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీలు, మౌలిక ప్రాజెక్టులు, ఆర్థిక కేటాయింపులను పొందుతుందని వివరించారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రధాన ప్రణాళికాధికారి సుధాకర్ రెడ్డి, ఏపీఐఐసీ జెడ్ఎం మదన్ మోహన్, పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావులతో పాటు సంబంధిత శాఖల జిల్లా అధిపతులు, రీజినల్ ప్లానింగ్ నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


