బిల్లా ఆచూకీ కోసం గాలింపు
గచ్చిబౌలి: గేమింగ్ బెట్టింగ్ ముఠాలోని ప్రధాన నిందితుడైన తిరుమల వెంకటేశ్ అలియాస్ బిల్లా కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుమల వెంకటేశ్ వీవీ హైట్స్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని కొంతకాలంగా క్రికెట్, టెన్నిస్, క్యాసినో, క్యారమ్, చెస్ తదితర గేమ్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. రోజూ వందలాది మంది బెట్టింగ్ కాస్తూ రూ.లక్షల్లో నష్టపోతున్నారు. వెంకటేష్ తన అనుచరులతో కలిసి దందా నిర్వహిస్తూ దాదాపు రూ.8 కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్‌తోపాటు అతడి అనుచరులు పిండి పవన్ దుర్గేశ్, పొలిశెట్టి సత్య ఫణీంద్ర ఆచూకీ కోసం ఏపీలోని దర్శి, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
దర్శి:
యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ దందా మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పది మందిని గుర్తించి కేసు నమోదు చేయగా వారిలో దర్శికి చెందిన తిరుమల వెంకటేష్ అలియాస్ బిల్లా ఏ–1 నిందితుడిగా ఉన్నాడు. గతంలోనూ బెట్టింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మళ్లీ ఇదే కేసులో చిక్కడం చర్చనీయాంశమైంది. కొండాపూర్‌లోని రాజేశ్వరీ నగర్ పరిధిలో వీవీ హైట్స్ భవనంలోని ఆరో అంతస్తు ఫ్లాట్ నంబర్ 601లో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో తిరుమల వెంకటేష్ (ఏ1), పిండి పవన్ దుర్గేష్ (ఏ2), పోలిశెట్టి సత్యఫణీంద్ర సచ్చిన్ (ఏ3), బండారు కిరణ్ (ఏ4), కొమ్మిరిశెట్టి శివరామ్ (ఏ5), సందు నరేష్ (ఏ6), నారపుశెట్టి అభి అయ్యప్ప (ఏ7), కుర్రా భరత్ (ఏ8), కొల్లుకొండ ఆంజనేయులు (ఏ9), సలీమ్ (ఏ10)పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద రూ.13,74,740 నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, 16 సెల్ఫోన్లు, 41 ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కిట్లు, 11 ఏటీఎం కార్డులు, 15 ఎయిర్టెల్ సిమ్ కార్డులు, మరో పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన వివరాలతో కూడిన మూడు నోట్ పుస్తకాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని లావాదేవీలు, ఇతరుల పాత్రపై దర్యాప్తు కీలకంగా మారింది.
గతంలోనూ ఆరోపణలు
ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. దర్శి కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులకు తెలియకుండా అద్దంకి సీఐతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. ఆ సమయంలో ఏ–1గా ఉన్న బిల్లాను కేసు నుంచి తప్పించారంటూ స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత బిల్లా కొంతకాలం విదేశాలకు వెళ్లినట్లు, తిరిగి దర్శికి వచ్చి మళ్లీ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో నమోదైన కేసులో ఏ–1 నిందితుడిగా పేరు రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో వ్యక్తులను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు, ఇటీవల బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.3 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని సమాచారం.
అధికార పార్టీ నేతల అండతో
దర్శి నియోజకవర్గంలో బెట్టింగ్ దందా సాగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన వారిలో
నియోజకవర్గానికి చెందిన టీడీపీ
ముఖ్యనేత మద్దతుదారులు ఉండటం గమనార్హం. యువత జీవితాలు
బలవుతుంటే రాజకీయ పలుకుబడితో నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలో పది మందిపై కేసు
ఏ–1గా దర్శికి చెందిన బిల్లా
బిల్లా దర్శి టీడీపీ ముఖ్యనేత
ప్రధాన అనుచరుడు
గతంలోనూ ఆరోపణలు..మళ్లీ అదే దందా
బెట్టింగ్ రాయుళ్లకు రక్షణా?
దర్శి నియోజకవర్గంలో బెట్టింగ్ నిర్వాహకులకు రాజకీయ అండ ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీకి బిల్లా ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, తిరునాళ్లలో ప్రభలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముఖ్యనేతకు దగ్గరగా ఉంటున్నాడని తెలిసింది. దీంతో బిల్లాపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ మాఫియా వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.


