దొనకొండ: అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అధికారుల తీరు ఉంది. చందవరం మొదటి సమ్మర్ స్టోరేజిలో నీరు ఫుల్గా ఉన్నా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారు. మండల కేంద్రం దొనకొండలోని ముస్లిం బజార్, వీవీపురం, బ్రహ్మరావుపేట, బేతేలుపురం, అరబస్తాన్, ఓబ్బాపురంలోని ప్రజలకు నెలల తరబడి తాగేందుకు మంచినీరు సరఫరా కావడం లేదు. గుక్కెడు మంచి నీరు కోసం ఆయా ప్రాంతాల ప్రజలు బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎల్నినో ప్రభావంతో వర్షాకాలం వేసవి కాలం తలపిస్తోంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి సరఫరా కోసం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో మంచినీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు నలుగురు చేరిన చోట చర్చించకుంటున్నారు. అధికారులకు దొనకొండ ఏ పాపం చేసిందో తెలియదు కానీ వారి నిర్లక్ష్యమే ప్రజలకు శాపంగా మారింది. వారం రోజుల్లో దసరా పండగ వస్తుందని, నీరు సరఫరా చేయగలరా.. అనే ప్రశ్న ప్రశ్నార్థకంగా మిగిలింది. దొనకొండ ప్రజలకు చుక్క కూడా నీరు అందించలేక అధికారులు విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం కూటమి ప్రజాప్రతినిధులకు తెలిసిన కూడా పట్టించుకోక పోవటం దారుణమంటున్నారు. ఇప్పటికై నా అధికారులు దొనకొండ ప్రజలను దృష్టిలో ఉంచుకుని సాగర్ జలాలు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏఈ కిరణ్కుమార్ను వివరణ కోరగా కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించక పోవడంతో వారు సమ్మె చేస్తున్నారని, వారి బ్యాంకులో జీతాల కోసం చెక్ వేశామని, రెండు రోజుల్లో జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని దొనకొండ ప్రజలకు సాగర్ జలాలు సరఫరా చేస్తామని తెలిపారు.
నెలల తరబడి సరఫరాకాని సాగర్ జలాలు
ముందస్తు చర్యలు తీసుకోని అధికారులు


