న్యూస్‌రీల్
రీ సర్వేలో తప్పులు.. పాస్‌పుస్తకాల్లోనూ అవే లోపాలు పేరు మారింది.. విధానం మారలేదంటున్న రైతులు వెలిగొండ నిర్వాసితులకు ప్యాకేజీల కోసం ఇంకా ఎదురుచూపులే.. కాలనీలు ఉన్నాయి.. పట్టాలు, మౌలిక వసతులు లేవు కరువు కమ్మేసినా అన్నదాతకు అండ ఏదీ.? ‘సూపర్ సిక్స్’ హామీల అమలు ఏదీ.? నేడు జరుగుమల్లిలో చంద్రబాబు చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వేళ హామీలపై ప్రజల నిలదీత
ఆరు నెలలుగా పాసుపుస్తకం కోసం ఎదురుచూపులు...
రీ సర్వే చేసినా.. తప్పులు అలాగే
కరువులో అన్నదాతకు అండ ఏది?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఎన్నికల ముందు హామీల వర్షం.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం.! భూముల రీ సర్వేలో తప్పులు లేకుండా పక్కాగా రికార్డులు ఇస్తామని చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల కష్టాలు తీరడం లేదు. రీ సర్వే పేరుతో భూముల విస్తీర్ణాల్లో తేడాలు.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ అవే తప్పులు.. నెలల తరబడి పాసుపుస్తకాల కోసం ఎదురుచూపులు.. ఇదీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతుల పరిస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వెలిగొండ కోసం భూములు, ఊళ్లు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్యాకేజీలు, పునరావాసం, కనీస వసతులు అందక అవస్థలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్న వేళ.. ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై ఎన్నికల సమయంలో తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని రైతులు గుర్తుచేస్తున్నారు. అయితే అదే విధానాన్ని పేరు మార్చి కొనసాగిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. భూముల రీ సర్వే చేసి రాజముద్రతో తప్పుల్లేని పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని చెప్పినా.. క్షేత్రస్థాయిలో రికార్డుల తప్పులు సరిదిద్దకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● వెలిగొండ నిర్వాసితుల కన్నీళ్లు ఆగలేదు...
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితుల కష్టాలు మాత్రం ఇంకా తీరలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 31న ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసి గ్రామాలను ఖాళీ చేయించినా.. గొట్టిపడియ, కలనూతల, గుండంచర్ల, సుంకేసుల తదితర గ్రామాల్లో పలువురికి పునరావాస ప్యాకేజీలు అందలేదని చెబుతున్నారు. ప్యాకేజీల కోసం కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోగులదిన్నె, కుంట, ఇడుపూరు–1, ఇడుపూరు–2, తోకలపల్లె తదితర పునరావాస కాలనీల్లో కనీస వసతులు లేవని నిర్వాసితులు చెబుతున్నారు. తాగునీటి కోసం ట్యాంకులు నిర్మించినా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇంటి పట్టాలు ఇచ్చామని చెబుతున్నా.. తమ స్థలం ఎక్కడో చూపించని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
● అంత్యక్రియలకూ దిక్కులేని దుస్థితి...
గుండంచర్లకు చెందిన నందిరెడ్డి వెంకటలక్ష్మమ్మ కుటుంబం గ్రామం ఖాళీ చేసి మార్కాపురంలో అద్దెకు ఉంటోంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. అద్దె ఇంటి యజమానులు మృతదేహాన్ని అక్కడికి తీసుకురావడానికి అంగీకరించకపోవడంతో మార్కాపురంలోని ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు అంత్యక్రియల కోసం ముంపు గ్రామానికే మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయంలో నీరు చేరడంతో గ్రామానికి నేరుగా వెళ్లే మార్గం లేక.. అటవీ ప్రాంతం చుట్టూ సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ముందస్తు పునరావాస చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి దుస్థితి వచ్చేదా? అని ప్రశ్నిస్తున్నారు.
● కాలనీ ఉంది.. పట్టాలు లేవు...
గుండంచర్ల గ్రామస్తుల కోసం దేవరాజుగట్టు సమీపంలో పునరావాసకాలనీ ఏర్పాటు చేసినా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. దీంతో ఇళ్లు నిర్మించుకోలేక అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు లేదు.. అద్దెకు ఇల్లు దొరకదు.. పునరావాస కాలనీలో కనీస వసతులు లేవు.. అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు.
● ‘సూపర్ సిక్స్’ ఎక్కడ.?
ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని, విద్యుత్ చార్జీలు పెంచబోమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని చంద్రబాబు హామీలిచ్చారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని.. విద్యుత్ బిల్లులు కూడా భారమయ్యాయని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రైతులకు రికార్డు కష్టాలు..
జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన కాకి జయపాల్‌కు సర్వే నంబరు 53లో 0.20 సెంట్ల భూమి ఉంది. ఆరు నెలలుగా పాస్‌పుస్తకం ఇస్తామని చెబుతున్నా ఇప్పటివరకు అందలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉందని రైతు సంఘాల నాయకులు, బాధితులు చెబుతున్నారు.
జరుగుమల్లి మండలం తూమాడు గ్రామానికి చెందిన వాసా నారాయణరెడ్డి తనకు సర్వే నంబరు 12–1లో 5.66 ఎకరాల హక్కు భూమి ఉందని తెలిపారు. గతంలో జరిగిన రీ సర్వేలో దానిని 5.43 ఎకరాలుగా నమోదు చేశారని, ఇటీవల రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చినా అదే 5.43 ఎకరాలు నమోదు చేశారని ఆరోపించారు. రికార్డుల్లో తప్పులు సరిచేయకుండానే పాసుపుస్తకాలు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుల సవరణకు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఇది ఒక్క నారాయణరెడ్డి సమస్య మాత్రమే కాదని.. జిల్లాలోని అనేక గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు నమోదయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. రీ సర్వేలోనే పొరపాట్లు సరిచేసి పక్కా రికార్డులు అందిస్తామని చెప్పి.. తీరా పాత తప్పులనే కొత్త పాస్ పుస్తకాల్లో ముద్రించారని విమర్శిస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను కరువు కమ్మేసినా రైతులను ఆదుకునే చర్యలు మాత్రం కనిపించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లు కాగా.. కేవలం 33 శాతం మేరకే పంటలు సాగయ్యాయని చెబుతున్నారు. సాగైన పంటలకూ వర్షాభావంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు మండలాల ప్రకటనతోనే ప్రభుత్వం చేతులు దులుపుకుందని రైతులు విమర్శిస్తున్నారు. పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ చేపట్టి రైతుల వారీగా నష్టం అంచనా వేయాలని.. తదుపరి సాగుకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని.. రుణాలను రీషెడ్యూల్ చేయాలని.. పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అన్నదాతలకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం.. రైతు కష్టకాలంలో మాత్రం కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.


