నెరవేరని కల! | - | Sakshi
Sakshi News home page

నెరవేరని కల!

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

నెరవేరని కల!

సంగమేశ్వరం ప్రాజెక్టు..రెండు దశాబ్దాలు కల..కొండపి నియోజకవర్గ మెట్ట ప్రాంతాల కరువు తీర్చేందుకు 2006లో చేపట్టిన ప్రాజెక్టు. 20 ఏళ్లు గడిచినా పూర్తికి నోచుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడం పాలకుల చిత్తశుద్ధిపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రూ.50.50 కోట్లతో ప్రారంభమైన

ప్రాజెక్టు..కాలం గడిచేకొద్దీ అంచనాలు

పెరిగాయి. ధరల వ్యత్యాసం, కాంట్రాక్టర్ల మార్పులు, అదనపు నిధుల అంశాలతో పనులు పదేపదే నిలిచిపోయాయి. ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత

తీసుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం

సమస్యకు పరిష్కారం చూపకుండా

ప్రకటనలతో కాలం వెళ్లదీస్తోందన్న

విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

మెట్ట ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాల్సిన ప్రాజెక్టు.. పాలకుల ప్రకటనలకే పరిమితమైంది. నిధులు, టెండర్లు, కాంట్రాక్టర్లు, హామీలు.. ఇలా ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రజల జీవనాడిగా భావించిన సంగమేశ్వరం.. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీలతో కాదు.. పనులతోనే ప్రాజెక్టు పూర్తవుతుందని, తమకు ఇక ప్రకటనలు కాదు.. నీళ్లే కావాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పొన్నలూరు:

మాకేరు–పాలేరు నదులపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా సంగమేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొండపి నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రూ.50.50 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.34.50 కోట్లు నిర్మాణానికి, రూ.16 కోట్లు భూసేకరణకు కేటాయించారు. 2007లో పనులు ప్రారంభమై 2009 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా..ఆ గడువు కాస్తా ఏళ్లుగా సాగిపోతోంది. దీంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు పంటలు సాగుచేయక భారీగా నష్టపోయారు.

నత్తనడకన పనులు

154 మీటర్ల పొడవున స్పిల్‌వే, 11 గేట్లు..ఇరువైపులా 2.8 కిలోమీటర్ల మట్టికట్ట..0.584 టీఎంసీల నీటి నిల్వ.. ఇవీ ప్రాజెక్టు రూపకల్పనలో ఉన్న లక్ష్యాలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనుల పురోగతి నత్తనడకనే. సుమారు రెండు దశాబ్దాలు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకపోవడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది.

9,500 ఎకరాలు..20 ఏళ్ల నిరీక్షణ

సంగమేశ్వరం పూర్తయితే పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల్లో 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయితే మెట్ట ప్రాంతంలో సాగు విస్తరించి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఆశలు కాగితాలకే పరిమితమయ్యాయి. 20 ఏళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు.

ధరలు పెరిగాయి..పనులు ఆగాయి

నిర్మాణ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్లు మారడం, పాత ధరలకు–ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం రావడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. 2015లోనే అదనంగా రూ.20 కోట్లు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. పనుల వ్యయానికి అనుగుణంగా అదనపు నిధులు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో కొంతకాలం మట్టికట్ట, ఎర్త్‌వర్క్‌ పనులు జరిగాయి. అయితే హామీ మేరకు నిధులు అందకపోవడంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి.

రైతుల ఆశలు..బీడు భూములుగా!

ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే మెట్ట ప్రాంతాల్లో వేల ఎకరాలు సాగులోకి వచ్చేవని రైతులు చెబుతున్నారు. సాగునీరు అందక పంటలు పండించుకోలేక ఇన్నేళ్లలో రూ.400 కోట్ల మేర నష్టపోయామని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల భూములకు నీరు ఇవ్వాల్సిన ప్రాజెక్టు.. పాలకుల హామీలకు మాత్రమే నీరందిస్తున్న పరిస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు.

లోకేష్‌ హామీ ఏమైంది?

2023లో యువగళం పాదయాత్ర సందర్భంగా పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్‌ సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్‌ను మార్చి పనులు వేగవంతం చేస్తామని ప్రకటించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.

ప్రకటనలే..పురోగతి ఏదీ?

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని పలుమార్లు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా పనుల్లో మాత్రం చెప్పుకోదగ్గ పురోగతి లేదు. తాజాగా రూ.166 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించినా.. ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి? పనులు ఎప్పుడు మొదలవుతాయి? అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, సంబంధిత కాంట్రాక్టర్లకు మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదన్న ఆరోపణలున్నాయి.

సంగమేశ్వరాన్ని పట్టించుకో బాబూ

శుక్రవారం సీఎం చంద్రబాబు నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో సంగమేశ్వరం ప్రాజెక్టుపై రైతులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకటనలు, హామీలు ఇక వద్దు.. రూ.166 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించాలి. క్రాంటాక్టరును పూర్తిచేయాలి.ఇరవై ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతారా? లేక మరోసారి హామీ ఇచ్చి వెళ్లిపోతారా? అని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

సంగమేశ్వరంపై పాలకుల నిర్లక్ష్యం

20 ఏళ్లుగా అదే తంతు..ప్రకటనలు తప్ప పనుల్లేవు

రూ.166 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా కదలని పనులు

మంత్రి లోకేశ్‌ హామీ.. చంద్రబాబు ప్రకటన..రెండూ నీటిమూటలే

9,500 ఎకరాలకు సాగునీరు..15 గ్రామాలకు తాగునీరు ఇంకా కలగానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement