తొలగించిన 1,32,076 మంది ఓటర్ల కోసం నూతన ప్రక్రియ పొరపాటున తొలగించినట్లు తేలితే అక్కడికక్కడే ఫారం–6 పూర్తి నేటి నుంచే స్పెషల్ డ్రైవ్
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026లో భాగంగా తొలగించిన ఓటర్ల వివరాల పునఃపరిశీలన కార్యక్రమం చేపట్టినట్లు డీఆర్‌ఓ పి.వెంకట రమణ తెలిపారు. జిల్లాలో తొలగించిన 1,32,076 మంది ఓటర్లను పొరపాటున తొలగించినట్లు తేలితే వారితో అక్కడికక్కడే ఫారం–6 దరఖాస్తు పూర్తి చేయించనున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. అర్హులైన ప్రతి ఓటరూ.. జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) తొలగించిన, అనర్హులుగా తేలిన ఓటర్ల వివరాల పునఃపరిశీలన చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి సదరు ఓటర్ల వివరాలను పునఃపరిశీలిస్తారన్నారు. అర్హులైన వారి ఓట్లు పొరపాటున తొలగించినట్లుగా తేలితే కొత్తగా ఓటు నమోదు కోసం వారితో ఫారం–6 నింపిస్తారన్నారు. తగిన పరిశీలన తర్వాత వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేరుస్తారన్నారు. ఆ మేరకు ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు ఆదేశాలిచ్చారని డీఆర్వో వెల్లడించారు.
ఏఎస్‌డీడీ జాబితాలోని వారి వివరాలు...
సర్‌లో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకూ బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మరణించిన ఓటర్లు – 41,458 మంది, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లు – 23,762 మంది, ఇప్పటికే నమోదైన ఓటర్లు – 15,016 మంది, గైర్హాజరు, గుర్తించలేని ఓటర్లు – 46,478 మంది, ఇతరులు 315 మంది కలిపి మొత్తం 1,27,059 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి పేర్లు తొలగించి జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. మొత్తం 12,71,977 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రచురించారు. ముసాయిదా జాబితాలోని ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ పత్రాల్లోని వివరాల్లో లోపాలనున్నాయని, నిర్దేశిత సమాచారాన్ని పొందుపరచలేదన్న కారణంతో ప్రకాశం జిల్లాలో మొత్తం 1,96,341 మందికి ఈఆర్‌ఓలు నోటీసులిచ్చారు. వారిని విచారించి 5,017 మందిని అనర్హులుగా తేల్చారు. ఈ నెల 16న ప్రచురించబోయే తుది జాబితాలో ఈ పేర్లు చేర్చొద్దని నిర్ణయించారు. అయితే అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరూ జాబితాలో లేకుండా ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో అబ్‌సెంటీ, షిఫ్ట్‌డ్, డెత్స్, డబుల్ ఎంట్రీగా (ఏఎస్‌డీడీ) పేర్కొని తొలగించిన 1,27,059 మంది ఓటర్ల వివరాలు, ముసాయిదా జాబితా విడుదల తర్వాత అనర్హులుగా గుర్తించిన 5,017 మంది ఓటర్ల వివరాలను ఇప్పుడు పునఃపరిశీలన చేయనున్నామన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ నెల 16న ప్రచురించబోయే తుది ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు, 2017 జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత నుంచి ఎప్పటికప్పుడు ఫారం–6 దరఖాస్తులు తీసుకోవాలని నిర్దేశించింది.
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయండి...
ముసాయిదా జాబితా విడుదలకు ముందు తొలగించిన, నోటీసులిచ్చి విచారించిన తర్వాత అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాల పునఃపరిశీలనకు ఇంటింటికీ వెళ్లే బూత్ స్థాయి అధికారుల బైట్లు, వారి అనుభవాల వీడియోలు చిత్రీకరించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలు తప్పకుండా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్ల అభిప్రాయాల వీడియోలు తీయాలని పేర్కొన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, నోటీసుల దశ సజావుగా సాగిందంటూ ఓటర్ల నుంచి సాక్ష్యాల వీడియోలు, ముసాయిదా జాబితాలో తొలగించేసినా నోటీసు దశ తర్వాత తిరిగి ఓటు హక్కు పొందిన వారి స్పందనల వీడియోలు తీయాలని సూచించారు. ఎన్నికల నమోదు అధికారులు వీటిని ఎప్పటికప్పుడు వారి సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేయాలన్నారు. ఎన్నికల నమోదు అధికారులు వారి సామాజిక మాధ్యమ ఖాతాలను వెంటనే క్రియాశీలకంగా చేయాలని, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రోజూ కనీసం 2 ఫొటోలు, 2 వీడియోలు ఆ ఖాతాల్లో పోస్టు చేయాలని సూచించారు. వాటిని జిల్లా ఎన్నికల అధికారి, సీఈవో, ఈసీఐ ఖాతాలకు ట్యాగ్ చేయాలని, ప్రతి పోస్టుతో పాటు ఆ ఓటరు పోలింగ్ స్టేషన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా పేరు స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఓటర్ల జాబితాలో ఉండాలని, అనర్హుల నమోదు ఉండకూడదని, ఎన్నికల సంఘం లక్ష్యానికి అనుగుణంగా సర్–2026 ప్రక్రియను ప్రకాశం జిల్లాలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు ఆదేశించారని డీఆర్వో తెలిపారు.


