భారత హేతువాద సంఘ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య
ఒంగోలు టౌన్: జిల్లాలోని గుడ్లూరు మండలం చేవూరు సర్వే నంబర్ 883 అటవీ భూమి, సర్వే నంబర్ 879 చెరువు పోరంబోకు భూములను రామదూత అనే దొంగస్వామి ఆక్రమించుకున్న విషయంపై అనేకసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య తెలిపారు. గురువారం ఒంగోలు నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే నంబర్ 883లో అనాథ పిల్లల స్కూల్ పేరుతో అనుమతులు తెచ్చుకుని యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ నిజంగా స్కూలు నిర్వహిస్తుంటే దేవుళ్లు, దయ్యాల బొమ్మలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. అనాథ స్కూలు పేరుతో ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దొంగస్వామి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా 2021లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకుండా తొత్తులుగా వ్యవహరించడం దారుణమన్నారు. రామదూత ఆక్రమించుకున్న భూములను అతడికే కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భూములు ఆక్రమిస్తే జైలే గతి అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే బేగ్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, హేతువాద నాయకులు శిఖా చంద్రశేఖర్‌బాబు, సీనియర్ నాయకుడు షేక్ నజీర్ పాల్గొన్నారు.


