పసిపాపకు పాము కాటు
అద్దంకి: ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న పసిపాపను పాము కాటేసిన సంఘటన అద్దంకి పట్టణంలోని పాత దామావారిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. వల్లెపు చిరంజీవి కుమార్తె(14 నెలల వయసు) తమ ఇంటి పరసరాల్లో రోజూలాగే ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడ సంచరిస్తున్న పాము పాప ఎడమ చేతిపై కాటు వేసింది. నొప్పి భరించలేక పాప ఏడవడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు తమ కుమార్తెను పాము కాటేసిందని గుర్తించారు. స్థానికులు 108కు ఫోన్ చేయడంతో తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గిద్దలూరు రూరల్: పట్టణంలోని సెయింట్‌పాల్స్ హైస్కూల్ సమీపంలో ఓ ఇంట్లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. అందిన వివరాల ప్రకారం.. ఒంగోలు హైవే రోడ్డుని టీ షాపులో పనిచేస్తున్న దంపతులు పది రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ తీవ్ర రక్త గాయాలతో ఉన్న మహిళను తన భర్త బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు ఆ ఇంటి వద్ద పెద్ద ఎత్తు గుమిగూడారు. మరణించిన మహిళ వయసు 35 ఏళ్లు ఉంటుందని, వారికి ఒక పాప కూడా ఉందని తెలిసింది. ఇంటి యజమాని హైదరాబాద్‌లో ఉండటం వల్ల వారి పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


