అంగన్‌వాడీలపై పోలీసు నిర్బంధం
చలో విజయవాడకు వెళ్లకుండా వేధింపులు యూనియన్ నాయకుల చిరునామాలు చెప్పమంటూ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై ఒత్తిడి పోలీసుల ఫోన్లతో అంగన్‌వాడీల్లో భయాందోళన ప్రభుత్వ నిర్బంధకాండపై సీఐటీయూ ఆగ్రహం
ఒంగోలు టౌన్/పామూరు: అంగన్‌వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంపై నిర్బంధం విధిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీలు సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోని అంగన్‌వాడీలు విజయవాడకు వెళ్లకుండా అధికారులు, అధికార పార్టీ నాయకుల ద్వారా ఒత్తిళ్లకు గురి చేయడమే కాకుండా పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతోందని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడ ధర్నాకు వెళ్లకుండా మైనంపాడులోని అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ నివాసం వద్ద ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లను కాపలా పెట్టారు. పొదిలిలోనూ ఇదే తరహాలో పోలీసులు ఒత్తిడి పెంచారు. పొదిలి ప్రాజెక్టు అధ్యక్షురాలు యం.శోభారాణి ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పామూరులో అంగన్‌వాడీ టీచర్లను, యూనియన్ నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి 8 మందిని బైండోవర్ చేయించారు. అయితే మహిళలను రాత్రి పూట పోలీసు స్టేషన్‌కు పిలిపించకూడదన్న నిబంధనలను పట్టించుకోకుండా మహిళా నాయకురాళ్లను రాత్రి పూట పోలీసు స్టేషన్‌కు పిలిపించాల్సిన అవసరమేముందని యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు ఫోన్లు చేస్తున్న పోలీసులు నాయకుల ఇంటి చిరునామాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు చోట్ల నేరుగా నాయకుల ఇళ్లకు వెళ్లి విజయవాడ ధర్నాకు వెళ్లవద్దని బెదిరించినట్లు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంగన్‌వాడీలు విజయవాడ వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అంగన్‌వాడీలను ఇళ్లకు పిలిపించుకొని ఒత్తిడి చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా విజయవాడ ధర్నాను విఫలం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం ఏమిటని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అదే తరహాలో నిర్బంధాలకు పాల్పడుతోందని గుర్తు చేస్తున్నారు.
అంగన్‌వాడీలపై పోలీసు నిర్బంధం


