భజే వాయుపుత్రం | - | Sakshi
Sakshi News home page

భజే వాయుపుత్రం

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

భజే వాయుపుత్రం

భజే వాయుపుత్రం

నేడు శింగరకొండ తిరునాళ్ల ఆలయంలో ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు తొమ్మిది ప్రభల ఏర్పాటు

అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శింగరకొండపైనున్న లక్ష్మీ నరసింహ స్వామి, కొండ కింద ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి 71వ వార్షిక ప్రధాన తిరునాళ్ల నేడు కావడంతో ఆలయ పరిసరాలు తిరునాళ్ల శోభను సంతరించుకున్నాయి. ఆలయ రాజగోపురాలు, ప్రాకారాలు రంగు రంగుల విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్షేత్రానికి వెళ్లే దారిలో వివిధ రకాల దుకాణాలు, వినోదాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. త్రయాహ్నికంగా (మూడు రోజులపాటు) నిర్వహించనున్న తిరునాళ్ల కార్యక్రమాలు శనివారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

తిరుమల తరహా లడ్డూ..

శింగరకొండ తిరునాళ్లకు వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తరహా లడ్డూను అందించేందుకు ఆలయ పాలకమండలి ఈవో తిమ్మనాయుడు ఆధ్వర్యంలో తిరుమల నుంచి నిష్ణాతులైన వారిని తీసుకొచ్చి లడ్డూ తయారు చేయిస్తున్నారు. అదే విధంగా ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లతో రూ.50, రూ.100 టికెట్‌ దర్శనంతో పాటు, ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు.

తొమ్మిది ప్రభలు..

తిరునాళ్లలో భక్తులను అలరించడం కోసం పరిసర గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల సానుభూతిపరులు తొమ్మిది ప్రభలు ఏర్పాటు చేయనున్నారు. వాటిపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరునాళ్ల సందర్భంగా మూడు రోజుల పాటు దేవస్థానం ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి గజ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఆదివారం ఉదయం నుంచి వివిధ రకాల పూజలు, రాత్రికి భజనా కార్యక్రమం, హనుమాన్‌ భజనా బృందంచే కోలాట ప్రదర్శన, నాటక ప్రదర్శన నిర్వహించారు.

30 ప్రత్యేక బస్సులు

తిరునాళ్లకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం శింగరకొండలో తాత్కాలిక బస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. అద్దంకి నుంచి 30 ప్రత్యేక బస్సులతోపాటు, ప్రధాన పట్టణాల నుంచి తిరునాళ్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భక్తులకు అన్నదాన సత్రాల్లో అన్నదానం చేయనున్నారు.

నేటి కార్యక్రమాలు..

సుప్రభాత సేవ, నిత్య విధులతోపాటు, దేవస్థాన వేదపండితులు, వేద విద్యార్థులతో మన్యుసూక్త పారాయణం, హోమం, భజన, కూచిపూడి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి ఏడు గంటలకు ఆలయం వద్ద రథోత్సవం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement