వెలిగొండపై ఇంకెన్నాళ్లు అబద్ధాలాడతారు | - | Sakshi
Sakshi News home page

వెలిగొండపై ఇంకెన్నాళ్లు అబద్ధాలాడతారు

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

వెలిగొండపై ఇంకెన్నాళ్లు అబద్ధాలాడతారు

వెలిగొండపై ఇంకెన్నాళ్లు అబద్ధాలాడతారు

● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై ఇంకెన్నాళ్లు అబద్ధాలు ఆడతారని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సీఎం మార్కాపురం వచ్చినప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. ప్రారంభించేది నేనే అని చెప్పుకోవడం కాదని, నిర్వాసితుల కష్టాలను అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే జులైకి వెలిగొండ నీరు ఇస్తామని ప్రకటించారని, నిర్వాసితులకు ప్యాకేజి ఇవ్వకుండా వారిని ఎలా బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. 2019 కటాఫ్‌ తేదీ తరువాత ప్యాకేజికి అర్హత పొందిన వారు చాలా మంది ఉన్నారని, వారందరికీ పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారని, వారిని కుటుంబంగా గుర్తించి ప్యాకేజి ఇవ్వాలన్నారు. గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజి ఇచ్చి పునరావాస కాలనీలో ఇళ్లు కట్టించాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఇచ్చే ప్యాకేజిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని కోరారు. వెలిగొండ కోసం గ్రామాలను, ఇళ్లను త్యాగం చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి సంతోషంగా బయటకు తేవాలన్నారు. వెలిగొండ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని, అవసరమైతే మళ్లీ పోరాడటానికి సిద్ధంగా ఉంటామన్నారు. సీఎం ప్రకటనల రూపంలో కాకుండా ఆచరణలో, బడ్జెట్‌లో నిధులు కేటాయించి త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి, జిల్లా కార్యదర్శి సోమయ్య పాల్గొన్నారు.

సుంకేసుల గ్రామం సందర్శన

పెద్దారవీడు: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల గోడు వినకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు మండిపడ్డారు. సీపీఎం మార్కాపురం జిల్లా ప్రతినిధి బృందం సుంకేసుల గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ఊసే ఎత్తకుండా మార్కాపురం జిల్లా పర్యటన ముగించుకోవటం క్షంతవ్యం కాదన్నారు. నిర్వాసితుల సమస్యలు వినడానికి, అర్జీ సైతం తీసుకునేందుకు అనుమతి నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. 2013లో భూ సేకరణ చట్ట ప్రకారం ప్యాకేజి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, మార్కాపురం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్‌ హనీఫ్‌, ఊసా వెంకటేశ్వర్లు, కె మాల్యాద్రి, దోర్నాల మండల కార్యదర్శి డి తిరుపతిరెడ్డి, మార్కాపురం పట్టణ కమిటీ సభ్యులు జవ్వాజి రాజు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement