ఏసీబీకి చిక్కిన వీఆర్వో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

రూ.20 వేలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

గుడ్లూరు: వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన గుడ్లూరులో శనివారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... గుడ్లూరుకు చెందిన రామాల మాధవరెడ్డి స్థానిక పెద్ద చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు అడ్డుకొని రెండు జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఈ వాహనాలను విడుదల చేసుకునేందుకు మాధవరెడ్డి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడు. అయితే వాటిని తహసీల్దార్‌ కార్యాలయం ద్వారా రిలీజ్‌ చేయించుకోవాలంటే ష్యూరిటీ సర్టిఫికెట్లు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి స్నేహితుడైన కె.వెంకట్రావు పేరుపై ష్యూరిటీ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్ల విషయమై వీఆర్వో చలమారెడ్డిని సంప్రదించారు. ష్యూరిటీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి చలమారెడ్డి రూ.20 వేల లంచం డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని మాధవరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచనలతో వీఆర్వోను పట్టుకునేందుకు పథకం రచించారు. వీఆర్వోకి మాధవరెడ్డి ఫోన్‌ చేసి గుడ్లూరులోని ఓ దుస్తుల దుకాణంలోకి వస్తే మీరు అడిగిన నగదు ఇస్తానని చెప్పాడు. దీంతో వీఆర్వో దుస్తుల షాపులోకి వచ్చారు. మాధవరెడ్డి తెచ్చిన నగదును ఒక కవర్‌లో పెట్టి వీఆర్వోకి ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, సీఐ విజయ్‌ కుమార్‌, మరో ముగ్గురు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement