జలతరింగిణి–2026 క్రీడలు ప్రారంభం
ఒంగోలు సబర్బన్: జలతరంగిణి–2026 వార్షిక క్రీడాపోటీలను హైదరీ ఆఫీసర్ క్లబ్‌లో శనివారం కన్‌స్ట్రక్షన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్. అబూతలీం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న జలవనరుల శాఖా ఉద్యోగులకు క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలను జోనల్ పోటీలకు పంపుతామన్నారు. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జీ బాలమురళీ కృష్ణ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇలాంటి పోటీలు నిర్వహించటం ఆనంద దాయకం అని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. ఈ పోటీలకు నోడల్ అధికారి అయిన చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) కె.రమేశ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీల నిర్వహణకు కోఆర్డినేటర్‌లు వి.నికేష్, బి.కృష్ణ కిషోర్, కె.సునీల్ కుమార్, టి.వేణు బాబులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ తేజ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


