రాజకీయ లబ్ధి కోసమే కల్తీ లడ్డూ వివాదం
ఒంగోలు టౌన్: రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ వివాదాన్ని రేపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ నిజంగా కల్తీ జరిగి ఉంటే ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, ఏ ల్యాబ్‌లో నిర్థారణ చేశారో తెలపాలని కోరారు. కల్తీ లడ్డూ విషయం ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని స్థితిలో, చట్టాన్ని చెప్పు చేతుల్లోకి తీసుకొని భౌతిక దాడులకు పాల్పడే వారి చేతుల్లోకి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్తీ జరగని ఆహారం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రం కల్తీ ఆహారానికి కేంద్రంగా తయారైందని ఆరోపించారు. తాగే నీరు, పసి పిల్లలు తాగే పాలు ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే పట్టించుకోకుండా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా లడ్డూ కల్తీ ఆరోపణలతో కాలయాపన చేయడం క్షమార్హం కాదన్నారు. ఇప్పటికై నా లడ్డూ వివాదానికి స్వస్తి పలికి రాష్ట్ర ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించకుండా సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒట్టిచేతులతో వెలిగొండను సందర్శించడం వలన ఉయోగమేమిటని ప్రశ్నించారు. నేటి నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికీ తిరిగి సామాజిక సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
● ఎదురెదురుగా కారు–మోటారు సైకిల్ ఢీ
● ఇద్దరు గిరిజన యువకులకు తీవ్రగాయాలు
పెద్దదోర్నాల: ఎదురెదురుగా వచ్చిన కారు – మోటారు సైకిల్ ఢీకొని ఇద్దరు గిరిజన యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నమూల టర్నింగ్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నంద్యాల జిల్లా పెచ్చెరువు గూడేనికి చెందిన గిరిజన యువకులు దాసరి మూగెన్న, దాసరి నాగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు.. పెద్దదోర్నాల నుంచి నంద్యాల జిల్లా పెచ్చెరువుకు మోటారు సైకిల్‌పై వెళ్తున్న దాసరి మూగెన్న, దాసరి నాగన్నలను శ్రీశైలంలో దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దదోర్నాల ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ
రాజకీయ లబ్ధి కోసమే కల్తీ లడ్డూ వివాదం
రాజకీయ లబ్ధి కోసమే కల్తీ లడ్డూ వివాదం


