ప్రజాధనం దుర్వినియోగం
మార్కాపురం టౌన్: చూస్తూచూస్తూ ప్రజాధనాన్ని అధికారులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి అద్దం పట్టే సంఘటన శనివారం జిల్లా కేంద్రమైన మార్కాపురంలో జరిగింది. అధికారులకు ముందుచూపు లేకపోతే ప్రజాధనం ఎలా నిరుపయోగం అవుతుందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. మార్కాపురంకు ఏడాది వ్యవధిలో రెండుసార్లు ముఖ్యమంత్రి, ఒకసారి ఉప ముఖ్యమంత్రి వచ్చారు. వారు వచ్చినప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు మొదట్లోనే ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వ స్థలంలో శాశ్వత ప్రాతిపదికపై హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. కానీ, అలా చేయలేదు. ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయాల్సిన హెలిప్యాడ్‌ను ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేశారు. ఒకసారి హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చివెళ్లిన తర్వాత ఆ స్థలం యజమాని జేసీబీతో హెలిప్యాడ్‌ను తొలగించారు. మార్కాపురం జిల్లాలో ఈ నెల 25వ తేదీ జరిగిన సీఎం సభకు సాయిబాలాజీ స్కూల్ ఎదురుగా ప్రైవేటు వ్యక్తుల స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను కూడా శనివారం సదరు స్థలం యజమాని తొలగించారు. దీంతో హెలిప్యాడ్ కోసం ఖర్చు పెట్టిన సుమారు రూ.5 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అదే హెలిప్యాడ్‌ను ప్రభుత్వం స్థలంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లను కూడా ఇలాగే తొలగించడంతో వాటికి పెట్టిన ఖర్చు కూడా వృథా అయిందని, పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి ధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సమంజసం కాదని అధికారుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు.
హెలిప్యాడ్ ధ్వంసంతో రూ.5 లక్షల ప్రభుత్వ నిధులు నిరుపయోగం


